ఉజ్జయినీ ఆలయంలో అగ్నిప్రమాదం – ఆరుగురి పరిస్థితి విషమం

మధ్యప్రదేశ్‌ : హోలీ పండుగ వేళ … మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినీ మహాకాలేశ్వర్‌ ఆలయంలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 14 మంది గాయపడ్డారు. వారిలో ప్రధాన పూజారి ఉన్నారు. ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. అయితే … ఆ ప్రదేశానికి కొద్ది దూరంలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్‌ యాదవ్‌ కుమారుడు, కుమార్తె తృటిలో ఈ ప్రమాదం నుండి తప్పించుకున్నారు.

సోమవారం జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటైన మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినీ మహా కాలేశ్వర్‌ ఆలయంలో హోలీ వేడుకలు జరుగుతున్నాయి. పండుగ రోజును పురస్కరించుకొని … ప్రధాన గోపురం కింద ఉన్న గర్భ గృహంలో భస్మహారతి కార్యక్రమం నిర్వహించారు. ఈ క్రమంలో ఆలయంలో స్వామికి గులాల్‌ను సమర్పిస్తుండగా ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. అక్కడే ఉన్న ఓ వస్త్రం మంటలకు అంటుకొని పూజారులు, భక్తులపై పడింది. ఈ విషయాన్ని ఆలయ పూజారి ఆశీష్‌ కూడా ధ్రువీకరించారు. కలెక్టర్‌ నీరజ్‌ కుమార్‌ సింగ్‌ మాట్లాడుతూ … ఈ ప్రమాదంలో మొత్తం 13 మంది గాయపడటంతో వారిని వెంటనే జిల్లా ఆస్పత్రికి తరలించామన్నారు. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని వారిని ఇందౌర్‌ ఆసుపత్రికి తీసుకెళ్లారని చెప్పారు. బాధితుల్లో ఆలయ ప్రధాన పూజారి సంజరు గౌర్‌ కూడా ఉన్నారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.

➡️