Patanjali: నాడు ఫుల్‌పేజీ ప్రకటనలిచ్చారు.. మరి క్షమాపణలు…

Apr 24,2024 08:23 #Patanjali, #Ramdev Baba, #Supreme Court

– ప్రకటన పరిమాణంపై రామ్‌దేవ్‌బాబాను ప్రశ్నించిన సుప్రీం
కేంద్రానికి మొట్టికాయలు
న్యూఢిల్లీ : క్షమాపణలు చెబుతూ వార్తా పత్రికల్లో ఇచ్చిన ప్రకటనలు, ఉత్పత్తులకు సంబంధించి గతంలో మీరు ఇచ్చిన ఫుల్‌ పేజీ ప్రకటనలకన్నా పరిమాణంలో పెద్దవా.. ఖరీదైనవా? అని పతంజలి ఆయుర్వేద్‌ సంస్థను, దాని
సహ వ్యవస్థాపకులు, యోగా గురు బాబా రామ్‌దేవ్‌్‌ను సుప్రీంకోర్టు మంగళవారం ప్రశ్నించింది. తమ ఆయుర్వేద ఉత్పత్తుల గురించి అభ్యంతరకరమైన, తప్పుదోవ పట్టించేవిధంగా ప్రకటనలను ప్రచురించినందుకు సుప్రీంకోర్టు ధిక్కార చర్యను పతంజలి, బాబా రామ్‌దేవ్‌, అతని సహచరుడు ఆచార్య బాలకృష్ణ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. తప్పుదోవ పట్టించే ప్రకటనలు నిలిపివేస్తామని గత ఏడాది నవంబరులో సుప్రీంకోర్టుకు ఇచ్చిన హామీని కూడా ఉల్లంఘించారు. వారు సమర్పించిన అఫిడవిట్లపై కూడా సుప్రీంకోర్టు అసంతృప్తిగా ఉంది. గత విచారణలో వీరు ముగ్గురూ బహిరంగ క్షమాపణలు చెబుతామని కోర్టుకు తెలిపారు. దీని గురించి మంగళవారం విచారణలో వివరాలు వెల్లడిస్తూ దేశవ్యాప్తంగా 67 వార్తాపత్రికల్లో క్షమాపణలు ప్రచురితమయ్యాయని వారి తరుపున న్యాయవాది ముకుల్‌ రోహత్గీ కోర్టుకు తెలిపారు. పది లక్షల రూపాయలు ఖర్చయ్యాయని చెప్పారు. దీనికి జస్టిస్‌ హిమా కోహ్లి, జస్టిస్‌ అహ్సానుద్దీన్‌ అమానుల్లాలతో కూడిన ధర్మాసనం స్పందిస్తూ ‘క్షమాపణలు చెబుతూ మీరు ఇచ్చిన ప్రకటనలు గతంలో ఇచ్చిన ఫ్రంట్‌ పేజీ ప్రకటనల కంటే పెద్దవా.. వాటి కంటే ఎక్కువ ఖర్చయిందా’ అని ప్రశ్నించింది. ప్రచురించిన క్షమాపణలు యొక్క ‘బ్లో-అప్‌’ కాపీలను కంపైల్‌ చేసి రిపోర్టు ఇవ్వాలని కోరింది. ‘క్షమాపణలు ప్రచురించిన వార్తపత్రికల వాస్తవ కాపీలను చూడాలనుకుంటున్నాం. ఏ పేజీలో ప్రచురించారు. ఎప్పుడు ప్రచురించారు అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటున్నాం’ అని తెలిపింది. ఈ వివరాలను సమర్పించేందుకు ఈ నెల 30 వరకూ న్యాయవాది రోహత్గీకి సమయం ఇచ్చింది. ఈ సందర్భంగా కేంద్రానికి కూడా ధర్మాసనం మొట్టికాయలు వేసింది. అభ్యంతరకరమైన ప్రకటనలపై చర్యలు తీసుకునే డ్రగ్స్‌ అండ్‌ కాస్మెటిక్స్‌ రూల్స్‌ 1945లో రూల్‌ 170ను ఈ కేసులో విస్మరించడంపై కేంద్ర ఆయుష్‌ మంత్రిత్వ శాఖ నుంచి ధర్మాసనం వివరణ కోరింది. స్వతంత్ర నిపుణుల సంఘం ఈ రూల్‌ 170ను సిఫారసు చేసినా, తరువాత కేంద్రం ఎలాంటి వివరణ లేకుండా ఈ రూల్‌ను తొలగించడంపై కోర్టు విస్మయం వ్యక్తం చేసింది. ‘వినియోగదారులను రక్షిస్తామని, అభ్యంతరకర ప్రకటనలపై చర్యలు తీసుకుంటామని మంత్రి పార్లమెంట్‌లో హామీ ఇస్తారు. ఈ కేసులో రూల్‌ 170ను తొలగించారు’ అని తెలిపిన జస్టిస్‌ కోహ్లి ఈ విషయంపై కేంద్రాన్ని వివరణ కోరారు. అడ్వర్టైజింగ్‌ స్టాండర్డ్స్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా గత రెండేళ్లలో ఆయుష్‌ మంత్రిత్వ శాఖ దృష్టికి 948 అభ్యంతరకర ప్రకటనలను తీసుకుని వెళ్లిందని, ”దీనిపై మీరు ఎలాంటి తదుపరి చర్య తీసుకున్నారు?” అని జస్టిస్‌ కోహ్లి ప్రశ్నించారు. ఈ కేసులో కన్జ్యూమర్‌ అఫైర్స్‌, ఇన్ఫర్మేషన్‌ అండ్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ మంత్రిత్వ శాఖలను కూడా కోర్టు పార్టీలుగా చేర్చింది. ఈ కేసు తదుపరి విచారణను మే 7కి వాయిదా వేశారు.

➡️