పార్లమెంట్‌ భద్రతావైఫల్యం కేసు : నీలమ్‌ ఆజాద్‌ పిటిషన్‌ తిరస్కరణ

న్యూఢిల్లీ :   పార్లమెంట్‌ భద్రతా వైఫల్యం కేసులో అరెస్టయిన నీలమ్‌ ఆజాద్‌ పోలీస్‌ రిమాండ్‌ను సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు బుధవారం తిరస్కరించింది. తన పోలీస్‌ రిమాండ్‌ చట్ట విరుద్ధమని, తక్షణమే విడుదల చేయాలని పిటిషన్‌లో కోరారు. పిటిషనర్‌ ఇప్పటికే ట్రయల్‌ కోర్టు ముందు బెయిల్‌ దరఖాస్తును సమర్పించారు. ఈ సమయంలో ఈ పిటిషన్‌ సమర్థనీయం కాదని మరియు తదనుగుణంగా కొటివేస్తున్నామని జస్టిస్‌ సురేష్‌ కుమార్‌ కైత్‌, జస్టిస్‌ మనోజ్‌ జైన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఆదేశించింది.

ఆమెను హైకోర్టు ముందు హాజరుపరిచేలా హెబియస్‌ కార్పస్‌ రిట్‌ మరియు ఆమెకు స్వేచ్ఛనిచ్చేలా ఆదేశించాలని నీలమ్‌ తరపు న్యాయవాది పిటిషన్‌లో కోరారు. అలాగే తనకు నచ్చిన న్యాయవాదిని సంప్రదించడానికి అనుమతించకపోవడానికి రాజ్యాంగం హామీ ఇచ్చిన తన ప్రాథమిక హక్కుని ఉల్లంఘించడమేనని, దీంతో రిమాండ్‌ ఆర్డర్‌ చట్టవిరుద్ధమని పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే విచారణ సమయంలో ఆమె ప్రాథమిక హక్కును ఉల్లంఘించేలా ఎటువంటి కారణాలు చూపలేదని హైకోర్టు పేర్కొంది.

పార్లమెంట్‌ భద్రతా వైఫల్యం కుట్రతో ప్రమేయం ఉన్నవారందరినీ గుర్తించేందుకు వారికి రిమాండ్‌ అవసరమని సిటీ పోలీసులు పేర్కొనడంతో .. నీలమ్‌ ఆజాద్‌ సహా నలుగురు నిందితులకు జనవరి 5 వరకు రిమాండ్‌ విధిస్తున్నట్లు గతేడాది డిసెంబర్‌ 21 ట్రయల్‌ కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే.

➡️