రాంచీకి హేమంత్‌ సొరేన్‌ : నేడు ఇడి విచారణ

Jan 31,2024 10:21 #ED, #hearing, #Hemant Soren, #Ranchi, #today

రాంచీ : జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరేన్‌ రాష్ట్ర రాజధాని రాంచీ మంగళవారం చేరుకున్నారు. బుధవారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాంచీలోని తన అధికారిక నివాసంలో తనను విచారించుకోవచ్చునని ఇడి అధికారులకు సోరేన్‌ ఇమెయిల్‌ చేశారు. ఈ నెల 27న సోరేన్‌ ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీలో ఇడి అధికారులు ఎంత ప్రయత్నించినా సోరేన్‌ను విచారించలేకపోయారు. సోరేన్‌ కోసం ఢిల్లీలోని ఆయన నివాసం, జార్ఖండ్‌ భవన్‌, ఇతర ప్రదేశాలకు ఇడి అధికారులు సోమవారం వెళ్లినా ఫలితం లేకపోయింది. ఢిల్లీ వెళ్లిన సోరేన్‌ తన తండ్రి శిబూ సోరేన్‌ను కలుసుకోవడం కోసం రోడ్డు మార్గం ద్వారా సోమవారం అర్ధరాత్రి రాంచీకి చేరుకున్నారు. మంగళవారం రాంచీలోని బాపు వాటిక వద్ద మహత్మా గాంధీకి నివాళి అర్పించారు. తరువాత తమ పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి సతీమణి కల్పన సోరేన్‌ కూడా పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితిపై ఈ సమావేశంలో చర్చించినట్లు సమాచారం. 2020 నుంచి 2022 మధ్యకాలంలో నకిలీ పత్రాలను సృష్టించి గిరిజనుల భూమిని కొనుగోలు చేసి, విక్రయించినట్లు సోరేన్‌పై ఇడి అభియోగాలు మోపింది. ఈ కేసులో ఇప్పటి వరకూ ఎనిమిదిసార్లు ఇడి సోరేన్‌కు సమన్లు జారీ చేయగా, ఆయన గైర్హాజరయ్యారు. సోరేన్‌ ఢిల్లీ నివాసరలో రూ.36 లక్షలు, ఎస్‌యువి స్వాధీనంఢిల్లీలో జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరేన్‌కు చెందిన నివాసం నుంచి రూ.36 లక్షలు నగదు, ఒక ఎస్‌యువి, కొన్ని విలువైన పత్రాలను ఇడి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దక్షిణ ఢిల్లీలోని 5/1 శాంతినికేతన్‌ నివాసంలో సోమవారం 13 గంటల పాటు ఇడి అధికారులు సోదాలు నిర్వహించారు.

➡️