అదానీ విద్యుత్‌ కోసం అధిక ధర 

Feb 8,2024 09:48 #Adani, #Electricity, #Gujarat
high price electricity for Adani

గుజరాత్‌ ప్రభుత్వంపై కాంగ్రెస్‌ మండిపాటు

అహ్మదాబాద్‌ : గుజరాత్‌లోని బీజేపీ ప్రభుత్వం అదానీ పవర్‌ లిమిటెడ్‌ (ఏపీఎల్‌) నుండి అధిక ధరకు విద్యుత్‌ను కొనుగోలు చేస్తోందని, అందుకోసం ఆ కంపెనీకి కోట్లాది రూపాయలు చెల్లిస్తోందని రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ విమర్శించింది. వాస్తవ ధర కంటే ఇది మూడు రెట్లు అధికమని తెలిపింది. 2022, 2023లో ఏపీఎల్‌ నుండి కొనుగోలు చేసిన విద్యుత్‌పై తొమ్మిది మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు శాసనసభ బడ్జెట్‌ సమావేశాలలో ప్రభుత్వాన్ని నిలదీశారు. దీనిపై ప్రభుత్వం వివరణ ఇస్తూ విద్యుత్‌ ఛార్జీలలో బొగ్గు కొనుగోలు ధర కూడా కలిపి ఉన్నదని తెలిపింది. 2022 ఫిబ్రవరిలో ప్రభుత్వం చేసిన తీర్మానం ప్రకారం విద్యుత్‌ రేట్లలో బొగ్గు కొనుగోలు ఖర్చును కలపాల్సి ఉందని వివరించింది. విద్యుత్‌ ఛార్జీలపై సీఎల్పీ నేత అమిత్‌ చావ్డా మాట్లాడుతూ అదానీ గురించి తాము ఆలోచించడం లేదని, పన్ను చెల్లింపుదారుల సొమ్ము దోపిడీకి గురవడమే తమను ఆందోళనకు గురిచేస్తోందని అన్నారు. డబుల్‌ ఇంజిన్‌ సర్కారు అంటే లాభాలు రెట్టింపు చేసుకోవడం కాదని చురక వేశారు. గత రెండు సంవత్సరాలలో విద్యుత్‌ కొనుగోలు కోసం రూ.8,265 కోట్లు ఖర్చు చేశారని, ఇది పాతిక సంవత్సరాల ఒప్పందం అయినందున రాబోయే సంవత్సరాలలోనూ ఈ భారం తప్పదని చెప్పారు.

➡️