ఆదాయపు పన్నుపై ఆశలు నెరవేరలేదు

Feb 2,2024 10:59 #Income Tax, #Interim Budget

దీర్ఘకాల దృష్టితో బడ్జెట్‌ రూపకల్పన

ఎఫ్‌టిసిసిఐ ప్రెసిడెంట్‌ మీలా జయదేవ్‌

హైదరాబాద్‌ :    బడ్జెట్‌లో ఆదాయపు పన్ను చెల్లింపుదారులందరూ కొన్ని ప్రయోజనాలను ఆశించారని పారిశ్రామికవేత్తల అసోసియేషన్‌ ఎఫ్‌టిసిసిఐ ప్రెసిడెంట్‌ మీలా జయదేవ్‌ అన్నారు. ఐటిలో స్టాండర్డ్‌ డిడక్షన్‌ మొత్తాన్ని పెంచడంతో పాటు పన్ను శ్లాబులను కూడా పెంచడం ద్వారా కొంత ఉపశమనం లభిస్తుందని ప్రజలు ఎదురు చూశారన్నారు. కానీ అది నెరవేరలేదన్నారు. ఏదేమైనా ఆదాయపు పన్ను, కొన్ని ఇతర పన్నుల పరంగా యథాతథ స్థితిని కొనసాగించారన్నారు. ఇది మధ్యంతర బడ్జెట్‌ స్వభావమన్నారు. సాధారణ ఎన్నికల తర్వాత జులైలో కొత్త ఆర్థిక మంత్రి పూర్తి స్థాయి బడ్జెట్‌ను సమర్పించినప్పుడు.. ఈ వెసలుబాటు కల్పిస్తారని.. పన్ను మినహాయింపుతో సహా మరిన్ని ఆశిస్తున్నామని మీలా జయదేవ్‌ అన్నారు. మంత్రి సీతారామన్‌ ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌ను మీలా జయదేవ్‌ సహా ఎఫ్‌టిసిసిఐ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సురేష్‌ కుమార్‌ సింఘాల్‌, కమిటీ సభ్యులు కలిసి ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించారు.

అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జయదేవ్‌ మాట్లాడుతూ.. బడ్జెట్‌లో ప్రతిపాదించబడిన గ్రామీణ గృహాలతో సహా వివిధ ప్రతిపాదనలు గ్రామీణ గృహ నిర్మాణం, నైపుణ్యాభివృద్థి, పర్యాటకం, వ్యవసాయ రంగాలకు ఊతమిచ్చేలా ఉందన్నారు. సోలార్‌ రూఫ్‌టాప్‌పై దృష్టి సారించడం, 300 యూనిట్ల వరకు ఉచిత సౌర విద్యుత్‌ను అందించాలనే ప్రణాళికలు స్వాగతించదగినదన్నారు. మధ్యంతర బడ్జెట్‌ దీర్ఘకాల దృష్టితో రూపొందించబడిందన్నారు.

పెట్టుబడిదారుల్లో విశ్వాసం : ఫిక్కీ ప్రెసిడెంట్‌

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ఇన్వెస్టర్లలో విశ్వాసాన్ని పెంచేలా ఉందని ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ చాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండిస్టీ (ఫిక్కీ) ప్రెసిడెంట్‌ అనిష్‌ షా పేర్కొన్నారు. ప్రస్తుత పెట్టుబడులు, సామాజిక సాధికారతకు ఇది దోహదం చేస్తుందన్నారు. ఇవి ఈకోసిస్టమ్‌ విస్తరణకు, పర్యాటక రంగానికి మేలు చేయనుందన్నారు.

ఏడాది పొడవున మార్పులుంటాయి : ఆనంద్‌ మహీంద్రా

బడ్జెట్‌పై ఎప్పుడూ భారీ ఆశలు పెట్టుకుంటామని.. అయితే భారీ విధాన మార్పులకు బడ్జెట్‌ ఒక్కటే వేదిక కాదని కార్పొరేట్‌ దిగ్గజం ఆనంద్‌ మహీంద్రా అన్నారు. ఇలాంటి మార్పులు ఏడాది పొడవునా ఇతర సందర్బల్లోనూ ఉంటాయన్నారు. కేంద్ర బడ్జెట్‌ను ఆనంద్‌ మహీంద్రా స్వాగతించారు. ఎన్నికలకు ముందు బడ్జెట్‌లో ఉండే జనాకర్షక పధకాలకు చోటు కల్పించకపోవడం ప్రశంసనీయమన్నారు.

➡️