ఎన్నికల వేళ … పశ్చిమ బెంగాల్‌లో ఎంత బంగారం.. మద్యం.. నగదు పట్టుబడిందంటే..

కోల్‌కతా : లోక్‌ సభ ఎన్నికల వేళ … దేశంలో అత్యధిక స్థాయిలో బంగారం, మద్యం, నగదు పట్టుబడుతోంది. పశ్చిమ బెంగాల్‌లో దాదాపు రూ.140 కోట్ల విలువైన బంగారం, డ్రగ్స్‌, మద్యంతోపాటు వివిధ వస్తువులు, రూ.7 కోట్లకు పైగా నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎన్నికల అధికారి తెలిపారు.

ఎన్నికల సంఘం విడుదల చేసిన వివరాల ప్రకారం … పశ్చిమ బెంగాల్‌లో శనివారం వరకు స్వాధీనం చేసుకున్న నగదు మొత్తం రూ.7.87 కోట్లు. అలాగే రూ. 33.86 కోట్ల విలువైన 12.7 లక్షల లీటర్ల మద్యాన్ని కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇక రూ. 18.28 కోట్ల విలువైన 3.5 కిలోల మాదక ద్రవ్యాలు, రూ. 27.32 కోట్ల విలువైన బంగారం పట్టుబడినట్లు వివరించారు. ఇప్పటివరకు సుమారు రూ.36 కోట్ల విలువైన ఇతర వస్తువులను కూడా స్వాధీనం చేసుకున్నామన్నారు. లెక్కలో చూపని నగదుతో సహా మొత్తం ఎలక్షన్‌ కమిషన్‌ స్వాధీనం చేసుకున్న బంగారం, మద్యం, ఇతర వస్తువుల విలువ రూ.147.19 కోట్లు ఉంటుందన్నారు. ఇదిలా ఉండగా, కోల్‌కతా పోలీసులు నగరంలోని జోరాబాగన్‌ ప్రాంతంలో చేపట్టిన తనిఖీలలో రూ.82 లక్షల విలువైన సుమారు 15 కిలోల బంగారు కడ్డీలను స్వాధీనం చేసుకున్నారు. వాహనంలో ప్రయాణిస్తున్న ఐదుగురిని అరెస్టు చేసినట్లు పోలీసు అధికారి తెలిపారు. ఈ బంగారు కడ్డీలు బంగ్లాదేశ్‌ సరిహద్దు గుండా స్మగ్లింగ్‌ చేసినట్లు తెలుస్తోంది.

➡️