ఉపాధి హామీ కూలీలకు పెరిగిన రోజువారీ వేతనం

Mar 29,2024 08:59 #daily wage, #increased

-ఎపి, తెలంగాణలో రూ.28 చొప్పున పెంపు
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :ఉపాధి హామీ కూలీల ఆందోళనతో కేంద్ర ప్రభుత్వం, వారి రోజువారీ వేతనాలను స్వల్పంగా పెంచింది. వివిధ రాష్ట్రాలకు గానూ మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద (ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎస్‌) 4 నుంచి 10 శాతం వరకు వేతనాలు పెంచింది. వేతనాల సవరణలో భాగంగా ప్రభుత్వం పెంపుదలను ప్రతిపాదించింది. ఈ పథకం కింద కార్మికులకు హర్యానాలో అత్యధిక వేతనం రోజుకు రూ.374 అందనుండగా, అరుణాచల్‌ప్రదేశ్‌, నాగాలాండ్‌లలో అత్యల్పంగా రూ.234 వేతనం అందనుంది. సిక్కింలోని మూడు పంచాయతీలు గ్నాతంగ్‌, లాచుంగ్‌, లాచెన్‌ ప్రజలు రోజుకు సగటు వేతనం రూ.374గా పొందనున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ (ఎంసిసి) అమలులో ఉన్నందున ఎన్నికల సంఘం నుంచి క్లియరెన్స్‌ వచ్చిన తరువాత ఈ పథకం కింద వేతన సవరణను మార్చి 27న కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ నోటిఫై చేసింది. కార్మికులు వారు నివసిస్తున్న గ్రామంలో ప్రతి కుటుంబానికీ ఆర్థిక సంవత్సరంలో కనీసం 100 రోజుల వేతన ఉపాధిని కల్పించడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని కుటుంబాల జీవనోపాధి భద్రతను పెంపొందించే లక్ష్యం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. నోటిఫికేషన్‌ ప్రకారం.. గోవాలో వేతన పెంపు రేటు దేశంలోనే అత్యధికంగా రూ.34గా ఉంది. ప్రస్తుతం అక్కడ రోజువారీ కూలి రూ.356 ఇస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో వేతన పెంపు రూ.28గా ఉంది. ఇప్పుడు మొత్తం కూలి రూ.300కు చేరింది. తెలంగాణలో రూ.28 పెంచడంతో రోజువారీ కూలి రూ.300కు చేరింది. ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌లలో పెరుగుదల అత్యల్పంగా రూ.7గా ఉంది. రెండు రాష్ట్రాల్లో పని చేసే కార్మికులు రోజుకు రూ.237 వేతనం అందుకోనున్నారు. పశ్చిమబెంగాల్‌లో రూ.250 (రూ.13 పెరుగుదల), తమిళనాడులో రూ.319 (రూ.25 పెరుగుదల), బీహార్‌లో రూ.228 (రూ.17 పెరుగుదల)గా ఉంది. వేతన రేటు పరంగా హర్యానా అగ్రస్థానంలో ఉన్నప్పటికీ, పెరుగుదల కేవలం నాలుగు శాతంగానే ఉంది. మొత్తమ్మీద పెంపుదల 4 నుంచి 10 శాతం మధ్య ఉంది. తెలంగాణ, ఎపి, గోవా, కర్ణాటక రాష్ట్రాల్లో దాదాపు 10 శాతం పెరుగుదల నమోదైంది.

➡️