తిహార్‌ జైలులో కేజ్రీవాల్‌కు ఇన్సులిన్‌..

ఢిల్లీ : ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో అరెస్టై తిహార్‌ జైలులో ఉన్న సీఎం కేజ్రీవాల్‌కు ఎట్టకేలకు ఇన్సులిన్‌ ఇచ్చారని ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) వెల్లడించింది. ఈ మేరకు మంగళవారం ఎక్స్‌లో పోస్టు చేసింది. ‘కేజ్రీవాల్‌ షుగర్‌ లెవల్‌ ప్రస్తుతం 320కి చేరుకుంది. చివరికి బీజేపీ, జైలు అధికారులు తేరుకుని కేజ్రీవాల్‌కు ఇన్సులిన్‌ అందించారు. ఢిల్లీ ప్రజల పోరాటం వల్లే ఇది సాధ్యమైంది. కేజ్రీవాల్‌కు ఇన్సులిన్‌ అందించడంలో విజయం సాధించాం’ అని పేర్కొంది.
అరవింద్‌ కేజ్రీవాల్‌కు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి ఇన్సులిన్‌ అవసరమా అని నిర్ధారించడానికి మెడికల్‌ బోర్డును ఏర్పాటు చేయాలని ఢిల్లీ కోర్టు ఎయిమ్స్‌ని ఆదేశించిన ఒక రోజు తర్వాత ఈ పరిణామం జరిగడం గమనార్హం. మరోవైపు కేజ్రీవాల్‌ కస్టడీపై రౌస్‌ అవెన్యూ కోర్టు మంగళవారం విచారణ చేపట్టనుంది. కేజ్రీవాల్‌ను ఏప్రిల్‌ 1 నుంచి15 వరకు జ్యుడీషియల్‌ కస్టడీకి పంపింది. ఆ తర్వాత అతని కస్టడీని ఏప్రిల్‌ 23 వరకు పొడిగించిన విషయం తెలిసిందే.

➡️