రాజ్యాంగ హక్కుల్లో అతిగా చొరబడుతోంది

  • ప్రసార సేవల బిల్లుపై ఎడిటర్స్‌ గిల్డ్‌

న్యూఢిల్లీ : ప్రభుత్వం ప్రచురించిన ప్రసార సేవల (నియంత్రణ) ముసాయిదా బిల్లుపై ఎడిటర్స్‌ గిల్డ్‌ ఆఫ్‌ ఇండియా అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ బిల్లు అస్పష్టంగా ఉన్నదని, రాజ్యాంగం ప్రసాదించిన హక్కుల్లో అతిగా చొరబడుతోందని విమర్శించింది. భావ ప్రకటనా స్వేచ్ఛ, పత్రికా స్వేచ్ఛ స్ఫూర్తికి ఈ బిల్లు వ్యతిరేకంగా ఉన్నదని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌కు రాసిన లేఖలో ఎడిటర్స్‌ గిల్డ్‌ పేర్కొంది. ప్రసార సలహా మండలి ఏర్పాటు ద్వారా మీడియాపై సెన్సార్‌షిప్‌ విధించేందుకు ప్రయత్నిస్తోందని పేర్కొంది. ప్రచురించే లేదా ప్రసారం చేసే వార్తలపై స్వీయ నియంత్రణ కోసం ఏర్పాటు చేసే కమిటీలపై ప్రభుత్వానికే పూర్తి నియంత్రణ ఉంటుందని తెలిపింది. ‘అస్పష్టత పేరుతో కార్యక్రమ ప్రసారాలను నియంత్రించడం, నిషేధించడం వంటి చర్యలకు ప్రభుత్వం పాల్పడవచ్చు. ప్రభుత్వానికి విశేషాధికారాలు కట్టబెడితే సమస్యలు ఏర్పడతాయి. ఫలితంగా మీడియా సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన వారిలో అనిశ్చితి నెలకొంటుంది’ అని పేర్కొంది.

➡️