JDU : ఎన్నికల్లో ముస్లింలు, యాదవులు నాకు ఓటు వేయలేదు.. అందుకు నేను వారికేమీ చేయను : జెడియు ఎంపి దేవేష్‌

పాట్నా : ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ముస్లింలు, యాదవులు తనకు ఓటు వేయనందుకు జెడియు ఎంపి దేవేష్‌ చంద్ర ఠాకూర్‌ వారిపై కక్షసాధింపు చర్యలకు దిగారు. భవిష్యత్తులో ఈ రెండు వర్గాలకు తాను ఏవిధమైన పని చేసిపెట్టనని బహిరంగంగా ప్రకటించారు. తాజాగా ఆయన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీహార్‌లో సీతామర్హి లోక్‌సభ స్థానం నుండి దేవేష్‌ చంద్ర ఠాకూర్‌ గెలుపొందారు. రెండురోజుల క్రితం దేవేష్‌ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘ముస్లింలు, యాదవులు రెండు వర్గాలకు చెందిన ఓటర్లు ఆర్‌జెడి పార్టీకి ఓటు వేశారు. అటువంటప్పుడు వారికి నేను పని ఎలా చేసిపెట్టగలను? అందుకే ఈ రెండు వర్గాలకు చెందిన వారికి నేను ఎలాంటి పనులను చేసిపెట్టను.’ అని అన్నారు.
కాగా, దేవేష్‌ వ్యాఖ్యలను మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. ఆయన స్పందించారు. ‘అవును. నేను ముస్లింలకు, యాదవుల కమ్యూనిటీకి చెందిన వారికి వ్యక్తిగతంగా ఏవిధమైన పని చేయను. వారు నా ఇంటికి వస్తే టీ, స్వీట్లు ఇచ్చి మర్యాద చేస్తాను. వారితో కబుర్లు చెబుతాను. కానీ వారికి కావాల్సిన పని మాత్రం నేను చేయను. ఎందుకంటే నేను 30 సంవత్సరాలకు పైగా వారి మధ్యనే ఉంటూ.. వారి పనులను చేసి పెట్టాను. అయినాసరే.. నేను ఎన్నికల్లో నిలబడితే.. వారు నాకు ఓటు వేయలేదు. ఈ రెండు వర్గాల ఓటర్లలో కనీసం ఐదు శాతం మంది ఓటర్లు కూడా నాకు ఓటు వేయలేదు. దీనికి నాకెంతో బాధగా ఉంది. రాజకీయాల్లో ఎన్ని ఆటుపోట్లు ఎదురైనాసరే.. నేను ప్రజాసేవ చేస్తూనే ఉంటాను.’ అని అన్నారు. తనకి బ్రహ్మణ వర్గం మద్దతు లభించిందని.. అందుకే ఆర్‌జెడి అభ్యర్థి అర్జున్‌ రారుపై గెలిచానని దేవేష్‌ అన్నారు. ఈ ఎన్నికల్లో ఆర్‌జెడి నేత అర్జున్‌ రారు 4,64,363 ఓట్లు సాధించారు. జెడియు నేత దేవేష్‌ 5,15,719 ఓట్లతో విజయం సాధించి పార్లమెంటులోకి అడుగుపెట్టనున్నారు.
బీహార్‌లో ఆర్‌జెడి పార్టీకే గడచిన 15 ఏళ్లుగా ముస్లిం ఓటు బ్యాంక్‌ ఉంది. దాదాపు 22. 14 శాతం ముస్లిం ఓటర్లు ఆర్‌జెడి పార్టీకే ఓటు వేస్తున్నారు. అత్యధిక ముస్లిం ఓటు బ్యాంక్‌ ఉన్నప్పటికీ ఈ ఎన్నికల్లో కేవలం ఆర్‌జెడి నాలుగు ఎంపీ సీట్లలోనే గెలిచింది. ఇక సీతామర్హిలో ముస్లింలు, యాదవులు కలిపి 6 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. కుల ఆధారిత సర్వే ప్రకారం.. సీతామర్హిలో 17.70 శాతం ముస్లింలు, యాదవులు 14.27 శాతం మంది ఉన్నారు. ఓబిసికి చెందిన ఓటర్లు కూడా ఎక్కువమందే ఉన్నారు.
దేవేష్‌ చంద్ర ఠాకూర్‌ వ్యాఖ్యలపై ఆర్‌జెడి మండిపడింది. దేవేష్‌ ప్రకటన రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమేనని, బీహార్‌లోని 32 శాతం మందిని అవమానించినట్లేనని ఆర్‌జెడి తీవ్రస్థాయిలో విమర్శలు చేసింది. జెడియు విభజించు పాలించు సూత్రాన్ని అమలుచేస్తుంది. అదే జెడియు లక్షణం. ఇలాంటి మనస్త్తత్వం ఉన్నవారు నితీష్‌ క్యాబినెట్‌లో సభ్యులుగా ఉన్నారు. ఇలాంటి కులతత్వవాదులు రాష్ట్ర జనాభాలోని 70 శాతం మందిని ఎప్పుడూ ద్వేషంతో చూస్తారు.’ అని ఈమేరకు ఆర్‌జెడి సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు చేసింది.

➡️