జగన్‌ ఫ్లోర్‌ లీడర్‌ మాత్రమే

Jun 26,2024 22:54 #jagan, #the floor leader

– ప్రతిపక్ష హోదా ఇవ్వడం సాధ్యం కాదు
– శాసనసభా వ్యవహారాలశాఖ మంత్రి పయ్యావుల
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇవ్వడం సాధ్యం కాదని, వైసిపి ఫోర్‌ లీడర్‌ మాత్రమేనని శాసనసభా వ్యవహారాలశాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ అన్నారు. బుధవారం వెలగపూడి సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తనకు ప్రతిపక్ష హోదా కల్పించాలని జగన్‌ రాసిన లేఖను చదువుతూ పలు అంశాలను మీడియాకు వెల్లడించారు. కనీసం పదిశాతం సీట్లు ఉంటే ప్రతిపక్ష హోదా వస్తుందని, అది సంప్రదాయంగా వస్తోందని తెలిపారు. అయితే వైసిపి నాయకులు రాసిన లేఖలో పేర్కొన్న పలు అంశాలు అసత్యాలని, అవగాహనా రాహిత్యంగా రాసినవని అన్నారు. జరగని అంశాలను జరిగినట్లు చూపించారని పేర్కొన్నారు. జగన్‌కు ఆప్తుడైన కెసిఆర్‌కు కూడా గతంలో కాంగ్రెస్‌ ప్రతిపక్ష హోదా ఇవ్వలేదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని సూచించారు. స్పీకర్‌కు లేఖ రాయడం అది కూడా బెదిరింపు ధోరణితో వ్యవహరించడం సరికాదని అన్నారు. జగన్‌ మద్యం, ఇసుక ఖాతాల పుస్తకాలే కాకుండా శాసనసభా వ్యవహరాల పుస్తకాలు కూడా చూడాలని సూచించారు. అసెంబ్లీ రూల్‌ బుక్‌ చదవాలన్నారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాలని రాసిన సలహాదారుల సూచనల మేరకు రాశారు తప్ప అందులో వాస్తవాలు లేవని, ఆయనకు నిబంధనల ప్రకారం ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతిపక్ష హోదా రాదని పేర్కొన్నారు. సంఖ్యతో సంబంధం లేదని చెబుతున్న జగన్‌.. గత అసెంబ్లీలో టిడిపి సభ్యులనుద్దేశించి ఎమ్మెల్యేలను లాగేసుకుంటే ప్రతిపక్ష హోదా ఉండదని అనేకసార్లు చట్టసభల సాక్షిగా బెదిరించారని, అప్పుడు నిబంధనల ప్రకారమే ఆయన ఆ మాట అన్నారని, అదే నిబంధన ప్రకారం తాము ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని పేర్కొన్నారు.

➡️