కోటాలో మరో విద్యార్థి అదృశ్యం.. వారం వ్యవధిలో రెండోఘటన

Feb 19,2024 14:28 #JEE Aspirant, #kota student, #Rajasthan

కోటా :    రాజస్థాన్‌లోని కోటాలో సోమవారం మరో విద్యార్థి అదృశ్యమయ్యాడు. వారం రోజుల వ్యవధిలో రెండో ఘటన జరగడంతో ఆందోళన వ్యక్తమౌతోంది. వారి ఆచూకీ కోసం పోలీసులు ముమ్మర గాలింపు చేపట్టారు.

ఉత్తరప్రదేశ్‌కు చెందిన పీయూష్‌ కపాసియా రెండేళ్లుగా కోటాలోని హాస్టల్‌లో ఉంటూ జెఇఇ  పరీక్షకు కోచింగ్‌ తీసుకుంటున్నాడు. ఫిబ్రవరి 13 నుంచి అతను కన్పించకుండా పోయినట్లు కుటుంబసభ్యులు వెల్లడించారు. గత మంగళవారం పీయూష్‌తో మాట్లాడామని, ఆ తర్వాత నుండి అతని ఫోన్‌ స్విచ్చాఫ్‌ వస్తోందని విద్యార్థి తండ్రి మహేశ్‌ చంద్‌ తెలిపారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అతని ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

గత ఆదివారం కోటాలో మరో విద్యార్థి అదృశ్యమైన సంగతి తెలిసిందే. మధ్యప్రదేశ్‌కు చెందిన మరో విద్యార్థి రచిత్‌ సోంధ్య  జవహర్‌ నగర్‌లో ఓ హాస్టల్‌లో ఉంటున్నాడు. ఫిబ్రవరి 11 నుండి అతను కనిపించడం లేదు. అతను చివరిసారిగా మహదేవ్‌ ఆలయానికి సమీపంలోని అటవీ ప్రాంతంలోకి ప్రవేశించడం సెక్యూరిటీ కెమెరా ఫుటేజీలో కనిపించినట్లు పోలీసులు తెలిపారు. అడవిలో అతడి బ్యాగు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఇద్దరి కోసం గాలింపు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

తమ కుమారుడి ఆచూకీ అందించాలని రచిత్‌ తల్లిదండ్రులు ప్రజలను కోరారు. పోస్టర్‌ల ద్వారా ప్రచారం చేస్తున్నారు.   ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని విద్యాశాఖ మంత్రి మదన్‌ దిలావర్‌ను కూడా సంప్రదించినట్లు సమాచారం.

కాగా, జెఇఇ, నీట్‌ పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు ప్రతి ఏడాది సుమారు 2 లక్షల మంది విద్యార్థులు కోటాలో చేరుతుంటారు. గత కొంతకాలంగా ఇక్కడ విద్యార్థుల వరుస ఆత్మహత్యలు  కలకలం రేపుతున్నాయి.

➡️