కవిత బెయిల్‌పై తీర్పు 6కు వాయిదా

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్‌ పిటిషన్‌పై తీర్పును రౌస్‌ ఎవెన్యూ కోర్టు (ట్రయల్‌ కోర్టు) ఈ నెల 6కు వాయిదా వేసింది. లిక్కర్‌ కేసులో సిబిఐ, ఇడి తనను అక్రమంగా అరెస్టు చేశాయని, తనకు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ కవిత వేర్వేరుగా బెయిల్‌ పిటిషన్లు దాఖలు చేశారు. సిబిఐ కేసులో గతనెల 22న విచారించిన రౌస్‌ అవెన్యూ కోర్టు తీర్పు మే 2కు రిజర్వ్‌ చేసింది. అనంతరం ఇడి దాఖలు చేసిన మనీలాండరింగ్‌ కేసులో మాత్రం బెయిల్‌ పిటిషన్‌పై తీర్పును మే 6న వెలువరిస్తామని ట్రయల్‌ కోర్టు వెల్లడించింది. దీంతో సిబిఐ కేసులో శుక్రవారం కవిత బెయిల్‌ పిటిషన్‌పై తుది తీర్పు వెలువడుతుందని భావించారు. ట్రయల్‌ కోర్టు ప్రారంభం కాగానే… తీర్పును వాయిదా వేస్తున్నట్లు స్పెషల్‌ జడ్జ్‌ కావేరి బవేజా వెల్లడించారు. ఇడి కేసులో బెయిల్‌ పిటిషన్‌తో కలిపి మే 6న సిబిఐ కేసులో తీర్పును వెలువరిస్తామని స్పష్టం చేశారు.

➡️