ఏడోసారి కూడా ఇడి ఎదుట హాజరు కాని కేజ్రీవాల్‌

Feb 26,2024 11:37 #ED, #Kejriwal

న్యూఢిల్లీ: లిక్కర్‌ స్కాం కేసులో ఢిల్లీ సిఎం అరవింద్‌ కేజ్రీవాల్‌కి ఇడి పలుమార్లు సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా విచారణకు ఫిబ్రవరి 26వ తేదీ సోమవారం ఇడి ఎదుట హాజరు కావాలని ఫిబ్రవరి 22వ తేదీన సమన్లు జారీ చేసింది. అయితే వరుసగా ఏడోసారి కూడా అరవింద్‌ కేజ్రీవాల్‌ విచారణకు హాజరు కాలేదు. ఇక ఈ సందర్భంగా ఆప్‌ పార్టీ స్పందించింది. ”ప్రస్తుతం ఈ అంశం కోర్టు పరిధిలో ఉంది. కేజ్రీవాల్‌కు పదేపదే సమన్లు జారీ చేసే బదులు కోర్టు నిర్ణయం కోసం వేచి ఉండాలి. తదుపరి విచారణ మార్చి 16న జరగనుంది. అప్పటివరకు ఈడీ ఓపిక పట్టాలి. కోర్టు నిర్ణయం కోసం వేచి ఉండాలి. మేం ఇండియా కూటమిని విడిచిపెట్టే ప్రసక్తి లేదు. మోడీ ప్రభుత్వం ఇలాంటి ఒత్తిడి చేయకూడదు’ అని ఆప్‌ పేర్కొంది.

ఈడీ ఇప్పటి వరకు ఏడుసార్లు కేజ్రీవాల్‌కు సమన్లు పంపించింది. తాజాగా ఫిబ్రవరి 22వ తేదీన పంపింది. గతంలో నవంబర్‌ 2న, డిసెంబర్‌ 21వ తేదీన ఈడీ సమన్లు జారీ చేసింది. అలాగే జనవరి 3న, జనవరి 13వ తేదీన విచారణకు హాజరుకావాలని నోటీసులు పంపింది. ఈడీ నోటీసుల్ని కేజ్రీవాల్‌ పట్టంచుకోలేదు. విచారణకు హాజరుకాలేదు. దీంతో జనవరి 31, ఫిబ్రవరి 14వ తేదీన కూడా ఈడీ నోటీసులు పంపింది. అయినప్పటికీ కేజ్రీవాల్‌ విచారణకు హాజరుకాలేదు. పైగా ఈడీ నోటీసులు అక్రమమంటూ కొట్టిపారేశారు.

➡️