జైలు నుంచి కేజ్రీవాల్‌ సందేశం

Mar 23,2024 17:54 #Kejriwal, #sunitha

న్యూఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ లిక్కర్‌ పాలసీ కేసులో అరెస్టయ్యారు. ఆయన అరెస్టయిన తర్వాత తాజాగా ఒక సందేశాన్ని పంపించారు. ఈ సందేశాన్ని ఆయన భార్య మాజీ ఐఆర్‌ఎస్‌ అధికారి సునీతా కేజ్రీవాల్‌ చదివి వినిపించారు. ఈ సందేశంలో ‘సమాజం కోసం పని చేయడం ఆపకండి, కొనసాగించండి. బీజేపీకి చెందిన వారిని కూడా ద్వేషించవవద్దు. భారతదేశంలో మాత్రమే కాకుండా వెలుపల కూడా దేశాన్ని బలహీనపరిచే శక్తులు ఉన్నాయి. నేను త్వరగా జైలు నుంచి బయటకు వచ్చి, ఇచ్చిన వాగ్ధానాలను నిలబెట్టుకుంటానని’ అని ఆయన పేర్కొన్నారు.ఇప్పటికే అర్హులైన మహిళా లభ్డిదారులకు నెలకు 1,000 రూపాయలు గౌరవ వేతనం అందించే పథకానికి సంబంధించి ఒక హామీ ఇచ్చాను. దాన్ని తప్పకుండా నెరవేరుస్తానని కేజ్రీవాల్‌ తన సందేశంలో వెల్లడించారు. ప్రతి క్షణం దేశానికి సేవ చేయడానికి నా జీవితం అంకితం. నా ప్రతి రక్తపు చుక్కను దేశ సేవ కోసం అంకితం చేస్తానని కేజ్రీవాల్‌ సందేశంలో పేర్కొన్నట్లు.. సునీతా కేజ్రీవాల్‌ ప్రస్తావించారు.తాను పోరాటాల కోసమే పుట్టానని, భవిష్యత్తులో కూడా పెద్ద సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. ప్రపంచంలోనే అత్యంత బలమైన, గొప్ప దేశంగా భారత్‌ను తీర్చిదిద్దాలని కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. దేశాన్ని బలహీనపరిచేందుకు అంతర్గత, బాహ్య శక్తులు ప్రయత్నిస్తున్నాయని, వీటిపై పోరాడాల్సిన అవసరం ఉందన్నారు.

➡️