పన్నులతో మధ్యతరగతి ప్రజల ఉసురు తీస్తున్న మోడీ ప్రభుత్వం

కోల్‌కతా  :     పన్నుల భారంతో మోడీ ప్రభుత్వం మధ్యతరగతి ప్రజల ఉసురుతీస్తోందని   ఆర్‌టిఐ కార్యకర్త, టిఎంసి ఎంసి సాకేత్‌ గోఖలే మండిపడ్డారు. చరిత్రలో మొదటిసారి కార్పోరేట్లపై విధించే పన్నుల కన్నా వ్యక్తిగత ఆదాయ పన్ను ద్వారా ప్రభుత్వ ఆదాయం భారీగా పెరిగిందని అన్నారు.  2019లో మోడీ ప్రభుత్వం రెండవసారి అధికారం చేపట్టేవరకు.. ఆదాయ పన్నుల కన్నా కార్పోరేట్‌ పన్నుల ఆదాయం అధికంగా ఉండేవని అన్నారు. అయితే మోడీ ప్రభుత్వం గత ఐదేళ్లుగా మధ్యతరగతి ప్రజలపై విధిస్తున్న పన్నుల ఉగ్రవాదంతో వారి పరిస్థితి దయనీయంగా మారింది.  మల్టీ మిలియన్‌ డాలర్ల అధిపతులైన కార్పోరేట్లు చెల్లించే పన్ను ఆదాయం కన్నా ఓ సాధారణ భారతీయుడు చెల్లించే సగటు పన్ను వల్ల ప్రభుత్వానికి అధిక ఆదాయం లభిస్తోందని,  ఇది సమంజసమేనా అని ప్రశ్నించారు.   ఈ విధానంతో  కార్పోరేట్లు కోట్లాది రూపాయలను  ఆర్జిస్తుంటే.. మధ్యతరగతి వ్యక్తి తన జీతం మొత్తాన్ని ఆదాయ పన్నుల రూపంలో చెల్లించి ఖర్చుల కోసం, ఇఎంఐలు చెల్లించేందుకు అల్లాడుతున్నాడని అన్నారు.

మధ్యతరగతి ప్రజల జీవితాలను మోడీ ప్రభుత్వం నాశనం చేసింది. జీతాలు పెరగడం లేదు కానీ పన్నులు మాత్రం ఇంటిపైకప్పను కూడా దాటుతున్నాయి. ఆదాయ పన్నుతో పాటు జిఎస్‌టి రూపంలో పరోక్ష పన్ను కూడా చెల్లించాల్సి వుంటుంది. పదేళ్ల బిజెపి ప్రభుత్వ హయాంలో మధ్యతరగతి ప్రజలపై పన్నులు విధించడం తప్ప వారి సంక్షేమం కోసం చేపట్టింది ఏమీ లేదని ధ్వజమెత్తారు.

మరోవైపు,  పన్నుల రూపంలో దోచుకోవడంతో పాటు మోడీ ప్రభుత్వం ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలకు నిధులు కూడా విడుదల చేయడం లేదు. ఆయా రాష్ట్రాలు న్యాయమైన బకాయిలు కూడా కోల్పోతున్నాయి.

 

➡️