గ్రామీణ కార్మికుల పట్ల మోడీ ప్రభుత్వం నిర్లక్ష్యం

Modi government neglects rural workers
  • జార్ఖండ్‌లో ‘జాతీయ ఉపాధి హామీ జన్‌ సున్వాయి’ 
  • కార్మికులు, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుల మద్దతు

న్యూఢిల్లీ : మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజీఎన్‌ఆర్‌ఇజిఎ) విషయంలో మోడీ సర్కారు అనుసరిస్తున్న వైఖరి, నిర్లక్ష్య తీరుకు వ్యతిరేకంగా కార్మికులు కదిలారు. జార్ఖండ్‌, బీహార్‌, ఉత్తర ప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ల నుంచి వేలాది మంది జార్ఖండ్‌లోని రాంకా హైస్కూల్‌ మైదానంలో జాతీయ జన్‌ సున్వాయికి హాజరయ్యారు. ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎ సంఘర్ష్‌ మోర్చా, జార్ఖండ్‌ ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎ వాచ్‌ నిర్వహించిన ఈ కార్యక్రమంలో సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు జైరాం రమేష్‌, కాంగ్రెస్‌ నాయకుడు కన్నయ్య కుమార్‌ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. కార్మికులు రోజురోజుకు ఎదుర్కొంటు న్న పెరుగుతున్న సవాళ్లను పరిష్కరించడం ఈ సమావేశం యొక్క ముఖ్యాంశం. జార్ఖండ్‌లోని లతేహర్‌కు చెందిన మహావీర్‌ పర్హయ్య పని, చెల్లింపులలో జాప్యం గురించి విచారం వ్యక్తం చేశారు. అక్కడ ఉన్న చాలా మంది తమ మనోభావాలను వెల్లడించారు. బీహార్‌లోని కతిహార్‌కు చెందిన ఫూల్‌ కుమారి పని కోసం డిమాండ్‌ను, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన భోలు పాండో సేవక్‌ లక్రా బడ్జెట్‌ కోతలు, డిజిటల్‌ హాజరు వ్యవస్థల విధింపుపై ఆందోళన వ్యక్తం చేశారు.

జార్ఖండ్‌ మాజీ గ్రామీణాభివృద్ధి మంత్రి అలంగీర్‌ ఆలం న్యాయమైన వేతనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను నొక్కిచెప్పారు. డిజిటల్‌ హాజరు విధానాన్ని వ్యతిరేకించారు. ఈ క్లిష్టమైన సమస్యలపై కేంద్రం ఒత్తిడి తెస్తానని ఆయన చెప్పారు. ఉపాధి హామీ సూత్రాలను మోడీ సర్కారు బలహీనపరుస్తున్నదని జైరాం రమేష్‌ విమర్శించారు. అనవసరమైన సాంకేతిక సంక్లిష్టతలను ప్రవేశపెడుతున్నారని అన్నారు. ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎ సంఘర్ష్‌ మోర్చా, జార్ఖండ్‌ ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎ వాచ్‌ సంయుక్తంగా రూపొందించిన చార్టర్‌ ఆఫ్‌ డిమాండ్స్‌ ప్రదర్శనతో ఈ ఈవెంట్‌ ముగిసింది. వయోజనులకు 100 రోజుల పని హామీ, ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ వేతనాలను రూ.800కు పెంచటం, 15 రోజుల్లో వేతన చెల్లింపులను వేగవంతం చేయడం, డిజిటల్‌ హాజరు వ్యవస్థను నిలిపివేయడం వంటి కీలక డిమాండ్లు ఉన్నాయి. పెండింగ్‌లో ఉన్న పరిహారాలపై సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయటం, ఆధార్‌ చెల్లింపు వ్యవస్థలను నిలిపివేయటం, సామాజిక తనిఖీలకు తగిన బడ్జెట్‌లను కేటాయించాలని చార్టర్‌ కోరింది.

➡️