మోడీ రాజీనామా చేయాలి : కిసాన్‌ సభ

Feb 18,2024 09:24 #AIKS, #Electoral Bonds, #PM Modi
ashok dhawale

న్యూఢిల్లీ : ఎన్నికల బాండ్లను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ రాజీనామా చేయాలని అఖిల భారత కిసాన్‌ సభ (ఎఐకెఎస్‌) డిమాండ్‌ చేసింది. అవినీతిపై పోరాడుతున్నానంటూ మోడీ చేస్తున్న ప్రచారం బూటకమని సుప్రీం కోర్టు తీర్పు రుజువు చేసిందని పేర్కొంది. అధికారంలో కొనసాగే నైతిక హక్కును కోల్పోయిన మోడీ రాజీనామా చేయాలని కిసాన్‌ సభ అఖిల భారత అధ్యక్షుడు అశోక్‌ ధావలే, ప్రధాన కార్యదర్శి విజూ కృష్ణన్‌ డిమాండ్‌ చేశారు. ఎన్నికల బాండ్ల ద్వారా రాజకీయ అవినీతికి చట్టపరమైన రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నించిందని తెలిపారు. 16,000 కోట్లకు పైగా బాండ్లలో బిజెపికి సింహభాగం దక్కిందన్నారు. ప్రత్యర్థి పార్టీ నేతలపై దాడులు చేస్తున్న ఇడి, సిబిఐ ఇప్పుడు బిజెపి కార్యాలయాలపై దాడులు చేయాలని డిమాండ్‌ చేశారు. వ్యవసాయ చట్టాలు, లేబర్‌ కోడ్‌లు, విద్యుత్‌ ప్రైవేటీకరణ బిల్లు, ప్రయివేటు బీమా కంపెనీలకు రూ.57,000 కోట్ల మేర లబ్ధి చేకూర్చిన ఫసల్‌ బీమా యోజన, ప్రభుత్వ రంగ సంస్థలను విక్రయించడం వంటివన్నీ కార్పొరేట్‌లకు లబ్ధి చేకూర్చేందుకు తీసుకొచ్చినవేనని విమర్శించారు. బిజెపికి బాండ్ల ద్వారా విరాళాలు ఇచ్చిన వారి పేర్లను వెల్లడించాలని డిమాండ్‌ చేశారు.

➡️