లొంగిపోవాల్సిందే : బిల్కిస్‌ బానో కేసులో దోషులకు స్పష్టం చేసిన సుప్రీం

  • గడువు పెంచేది లేదు

న్యూఢిల్లీ : బిల్కిస్‌ బానో కేసులో దోషులు లొంగిపోవడానికి మరింత గడువు ఇచ్చేందుకు సుప్రీం కోర్టు శుక్రవారం తిరస్కరించింది. ”జనవరి 8న లొంగిపోవాల్సిందిగా మీకు ఆదేశాలు జారీ చేసేటప్పుడు మీ వ్యవహారాలను చక్కదిద్దుకోవడానికే రెండు వారాల గడువు ఇచ్చాం” అని జస్టిస్‌ బివి నాగరత్న దోషుల తరపు న్యాయవాదులకు తెలిపారు. తమ ఆరోగ్యం బాగా లేదని లేదా తమ కుటుంబ సభ్యుల ఆరోగ్యం బాగా లేదని, కొడుకు పెళ్లి వుందని, పంట ఇంటికి వచ్చే రోజులని, తల్లిదండ్రులకు ఆరోగ్యం బాలేదని… ఇలా దోషులు మళ్లీ జైలుకు వెళ్ళేందుకు మరికొంత గడువు కావాలంటూ పలు కారణాలు చెబుతున్నారు. ”మీరు చెబుతున్న కారణాల్లో ఏ ఒక్కటీ కూడా సరైంది కాదు, కోర్టు ఆదేశాలు అమలు కాకుండా ఈ కారణాలేవీ అడ్డుకోలేవు.” అని జస్టిస్‌ నాగరత్న పేర్కొన్నారు. భోజన విరామ సమయంలో దీనిపై స్వల్ప సమయం విచారించిన ఆమె పై ఆదేశాలు జారీ చేశారు. లొంగుబాటు ఆదేశాల అమలును వాయిదా వేయాలని కోరుతూ గురువారం నుండి వరుసగా పిటిషన్లు రావడం ఆరంభమయ్యాయి. లొంగుబాటుకు గడువు 20తో ముగుస్తున్నందున అత్యవసరంగా పిటిషన్లు విచారించాలని కోరడంతో జస్టిస్‌ నాగరత్న శుక్రవారం విచారించారు.

➡️