ఎన్ని కేసులైనా పెట్టుకోండి.. నన్ను భయపెట్టలేరు

Jan 25,2024 07:53 #Assam, #Rahul Gandhi, #Yatra
  • అసోం యాత్రలో రాహుల్‌

గౌహతి : తనపై ఎన్ని కేసులైనా పెట్టుకోవచ్చునని, బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్‌ తనను భయపెట్టలేవని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చెప్పారు. అసోంలోని బార్‌పేటలో ఆయన బుధవారం భారత్‌ జోడో న్యారు యాత్రను ప్రారంభించారు. కాంగ్రెస్‌ కార్యకర్తలు, పోలీసులకు మధ్య మంగళవారం ఘర్షణలు చెలరేగిన నేపథ్యంలో రాహుల్‌, ఇతర పార్టీ నేతలపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఆయన మండిపడుతూ కేసులతో తనను భయపెట్టలేరని అన్నారు. ‘కేసుల ద్వారా నన్ను భయపెట్టవచ్చునని ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఎలా అనుకుంటున్నారో నాకు తెలియదు. మరో పాతిక కేసులు పెట్టుకోండి. నేనేమీ భయపడను’ అని చెప్పారు. అసోం భాష, సంస్కృతి, చరిత్రను తుడిచివేయాలని బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ అనుకుంటున్నాయని ఆరోపించారు. అసోంను నాగపూర్‌ నుండి నడపాలని వారు భావిస్తున్నారని, కానీ తాము అందుకు అనుమతించబోమని చెప్పారు. ప్రజల జేబులు కొల్లగొట్టడంలో బిశ్వ శర్మ అందెవేసిన చేయి అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాను విద్వేషాలను రెచ్చగొడుతున్నానంటూ ముఖ్యమంత్రి చేసిన ఆరోపణను ప్రస్తావిస్తూ ‘రోజుకు 24 గంటలూ ఆ పని చేస్తోంది ఆయనే. మీరు పత్రికలు, టీవీ చూస్తుంటే వాటి వెనుక ఆయనే ఉంటారు. ఆయన ఏం చెబితే అదే మీడియా మీకు చెబుతుంది. దేశంలో అత్యంత అవినీతిపరుడైన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది బిశ్వ శర్మే. అసోం ముఖ్యమంత్రి రిమోట్‌ అమిత్‌ షా చేతిలో ఉంది. ఒకవేళ అమిత్‌ షాకు వ్యతిరేకంగా ఆయన ఏదైనా మాట్లాడితే రెండు నిమిషాలలోనే పార్టీ నుండి బయటికి గెంటేస్తారు’ అని చెప్పారు.

హింస, కవ్వింపు, ప్రభుత్వ ఆస్తులకు నష్టం, పోలీసు సిబ్బందిపై దాడి వంటి చర్యలకు పాల్పడిన రాహుల్‌ గాంధీ, కేసీ వేణుగోపాల్‌, కన్హయ కుమార్‌ తదితరులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశామని ముఖ్యమంత్రి బిశ్వ శర్మ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో తెలియజేశారు. కుట్రకు పాల్పడడం, చట్టవిరుద్ధంగా సమావేశం కావడం, అల్లర్లకు దిగడం వంటి నేరాలకు సంబంధించి ఐపీసీలోని పలు సెక్షన్ల కింద వారిపై కేసులు పెట్టారు.

రాహుల్‌ భద్రతపై ఆందోళన : అమిత్‌ షాకు ఖర్గే లేఖ

అసోంలో రాహుల్‌ గాంధీ భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ కేంద్ర హౌంమంత్రి అమిత్‌ షాకు కాంగ్రెస్‌ అధ్యక్షలు మల్లికార్జున ఖర్గే లేఖ రాశారు. అసోంలో భారత్‌ జోడో న్యారు యాత్ర సందర్భంగా రాహుల్‌ కు భద్రత కల్పించడంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, అనేక భద్రతా లోపాలు వెలుగుచూశాయని ఖర్గే విమర్శించారు. ఇందుకు సంబంధించిన కొన్ని ఘటనలను తన లేఖలో ప్రస్తావించారు. ముఖ్యంగా ఈ నెల 22న నాగావ్‌ జిల్లాలో రాహుల్‌ గాంధీ కాన్వారును బిజెపి కార్యకర్తలు అడ్డుకున్నారని, వారు రాహుల్‌ గాంధీకి అత్యంత సమీపానికి వచ్చారని ఖర్గే ఆందోళన వ్యక్తం చేశారు. ఓ జాతీయ స్థాయి నేత కాన్వారు లోకి ఇతరులు చొరబడి సమీపానికి రావడం అత్యంత అభద్రతో కూడిన పరిస్థితి అని వివరించారు. ఇంత జరుగుతున్నా అసోం పోలీసులు ప్రేక్షకుల్లా చూస్తూ ఉన్నారని, కొన్నిసార్లు పోలీసులే దగ్గరుండి బిజెపి కార్యకర్తలను కాన్వారు లోకి పంపించారని ఖర్గే ఆరోపించారు. ఇప్పటివరకు అసోం పోలీసులు ఎవరినీ అరెస్ట్‌ చేయకపోవడం శోచనీయం అని పేర్కొన్నారు. రాహుల్‌ యాత్ర ముందుకు సాగేకొద్దీ ముప్పు అధికమవుతోందని, ఇకనైనా మీరు జోక్యం చేసుకోవాలని అమిత్‌ షాను కోరారు. రాహుల్‌ యాత్రకు తగిన భద్రత కల్పించేలా అసోం ముఖ్యమంత్రి, డీజీపీలకు దిశానిర్దేశం చేయాలని ఖర్గే తన లేఖలో విజ్ఞప్తి చేశారు.

➡️