Second time లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా

మూజువాణి ఓటుతో తీర్మానం ఆమోదం
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :పద్దెనిమిదవ లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా ఎన్నికయ్యారు. రెండో మోడీ ప్రభుత్వ హయాంలో కూడా ఓం బిర్లానే లోక్‌సభస్పీకర్‌గా ఉన్నారు. స్పీకర్‌ స్థానానికి బిర్లాకు పోటీగా ఇండియా బ్లాక్‌ తరుపున కాంగ్రెస్‌ సీనియర్‌ ఎంపీ కె సురేష్‌ నిలిచారు. బుధవారం మూజువాణి ఓటుతో ఓం బిర్లా ఎన్నికైనట్లు ప్రొటెం స్పీకర్‌ భర్తృహరి మెహతాబ్‌ ప్రకటించడంతో ఆయనను ప్రధాని నరేంద్ర మోడీ, ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌ గాంధీ స్పీకర్‌ స్థానం వద్దకు తోడ్కొని వెళ్లారు. సభను ప్రారంభం కాగానే పశ్చిమ బెంగాల్‌కు చెందిన టిఎంసి ఎంపి అధికారి దీపక్‌ చేత ప్రొటెం స్పీకర్‌ ప్రమాణం చేయించారు. అనంతరం స్పీకర్‌ ఎన్నిక ప్రక్రియను ప్రారంభించారు. ఓం బిర్లా పేరును ప్రతిపాదిస్తూ 17 తీర్మానాలు రాగా, కె సురేష్‌ పేరును ప్రతిపాదిస్తూ మూడు తీర్మానాలు వచ్చాయి. ఓ బిర్లా పేరును ప్రతిపాదిస్తూ ప్రధాని మోడీ ప్రవేశపెట్టిన తీర్మానానిన్న కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ బలపరిచారు. ఆర్డర్‌ ప్రకారం ఈ తీర్మానం మొదట వచ్చినందున దీనిని ప్రొటెం స్పీకర్‌ ఓటింగ్‌కు పెట్టారు. ఈ తీర్మానం మూజువాణి ఓటుతో ఆమోదం పొందడంతో మిగతా తీర్మానాలను పరిగణనలోకి తీసుకోలేదు. ప్రతిపక్షాలు కూడా బ్యాలెట్‌, ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌కు పట్టుబట్టకపోవడంతో స్పీకర్‌గా ఓం బిర్లా ఎన్నికైనట్లు ప్రొటెం స్పీకర్‌ ప్రకటించారు.. ఓం బిర్లా ఎన్నికైనట్లు ప్రకటించిన తరువాత కేంద్ర మంత్రి రాజీవ్‌ రంజన్‌ సింగ్‌ (జెడియు) లేచి డివిజన్‌ (ఓటింగ్‌)కు డిమాండ్‌ చేశారు. ప్రొటెం స్పీకర్‌ మెహతాబ్‌ జోక్యం చేసుకొని, ఆ దశ దాటిపోయామని చెప్పారు.
ఇండియా బ్లాక్‌ అభ్యర్థి సురేష్‌ తరపున సమర్పించిన మూడు తీర్మానాల్లో ఒకదానిని అరవింద్‌ గణపత్‌ సావంత్‌ (శివసేన-ఠాక్రే) ప్రతిపాదించగా, ఎన్‌కె ప్రేమ్‌ చంద్రన్‌ (ఆర్‌ఎస్‌పి) బలపరిచారు. రెండో తీర్మానాన్ని ఆనంద్‌ భదౌరియా (ఎస్‌పి), మూడో తీర్మానాన్ని సుప్రియా సులే (ఎన్‌సిపి-శరద్‌ పవర్‌) ప్రతిపాదించారు..
సభా సంప్రదాయంలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్‌ రిజిజు లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్‌ గాంధీ ఓం బిర్లా వద్దకు వెళ్లి అభినందనలు తెలిపారు. ఆ తరువాత స్పీకర్‌ స్థానం వద్దకు ఆయనను వారు తోడ్కొని వెళ్లారు.. స్పీకర్‌ తన సీట్లో ఆశీనులైన తరువాత వివిధ పార్టీల సభ్యులు స్పీకర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. స్పీకర్‌ ఎన్నిక ప్రక్రియ ముగియగానే ప్రధాని మోడీ మంత్రులను సభకు పరిచయం చేశారు.

➡️