Delhi HC : ముఖ్యమంత్రి పదవి నుంచి కేజ్రీవాల్‌ని తొలగించలేం

  •  మరోసారి స్పష్టం చేసిన ఢిల్లీ హైకోర్టు

న్యూఢిల్లీ : ప్రస్తుతం జైలులో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ను పదవి నుండి తొలగించాల్సిందిగా దాఖలైన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు గురువారం తోసిపుచ్చింది. మద్యం పాలసీ కుంభకోణం కేసులో అరెస్టయిన కేజ్రీవాల్‌ ప్రస్తుతం తీహార్‌ జైలులో ఉన్న విషయం తెలిసిందే. ఆయనను పదవి నుండి తొలగించాల్సిందిగా గతంలోనే ఓ పిటిషన్‌ దాఖలైంది. దానిని హైకోర్టు తోసిపుచ్చింది. తాజాగా మరో పిటిషన్‌ దాఖలు కాగా దానిని కూడా తిరస్కరించింది. పదవిలో కొనసాగాలా వద్దా అనే దానిపై నిర్ణయం తీసుకోవాల్సింది కేజ్రీవాలేనని హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ స్పష్టం చేసింది.
‘కొన్ని సందర్భాలలో వ్యక్తిగత ప్రయోజనాలు దేశ ప్రయోజనాలకు సహాయకారిగా ఉండాల్సి ఉంటుంది. కానీ అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం. పదవిలో ఉండాలా వద్దా అనేది ఆయన నిర్ణయమే. మనకు ఓ న్యాయస్థానం ఉంది. న్యాయస్థానం రాష్ట్రపతి పాలన లేదా గవర్నర్‌ పాలన విధించిన సంప్రదాయం ఏదైనా ఉన్నదా?’ అని తాత్కాలిక న్యాయమూర్తి జస్టిస్‌ మన్మోహన్‌ నేతృత్వంలోని బెంచ్‌ వ్యాఖ్యానించింది. కేజ్రీవాల్‌ను పదవి నుండి తొలగించాలంటూ సామాజిక కార్యకర్త, హిందూసేన జాతీయ అధ్యక్షుడు విష్ణు గుప్తా ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. కొద్దిసేపు వాదనలు కొనసాగిన తర్వాత ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని ఉపసంహరించుకుంటున్నామని గుప్తా న్యాయవాది కోర్టుకు తెలిపారు. లెఫ్టినెంట్‌ గవర్నరును ఆశ్రయిస్తామని చెప్పారు.

➡️