పిఒకెలో ఆందోళనకారులపై పోలీసుల ఉక్కుపాదం

శ్రీనగర్‌ :    పాక్‌ ఆక్రమిత కాశ్మీరీ (పిఒకె) ద్రవ్యోల్బణం, అధిక పన్నులు, విద్యుత్‌ కొరతను వ్యతిరేకిస్తూ ప్రజలు చేపట్టిన ఆందోళనలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. శనివారం జరిగిన ఘర్షణల్లో ఓ పోలీస్‌ అధికారి మరణించగా, 90 మంది గాయపడ్డారు. జమ్ముకాశ్మీర్‌ జాయింట్‌ అవామీ యాక్షన్‌ కమిటీ (ఎఎసి) నేతృత్వంలో శనివారం చక్కా జామ్‌, సమ్మెను ప్రకటించారు. వ్యాపారులు ఈ సమ్మెలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఆందోళనకారులు ‘ఆజాదీ’ అంటూ నినాదాలు చేపట్టారు. ముజఫరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో ర్యాలీ చేపడుతున్న ఆందోళనకారులపై పోలీసులు, భద్రతా సంస్థలు విరుచుకుపడ్డాయి. ప్రజల చట్టబద్ధమైన హక్కులకోసం శాంతియుతంగా పోరాడుతున్న తమను అప్రతిష్టపాలు చేసేందుకు పోలీసులు యత్నిస్తున్నారని అన్నారు. శుక్రవారం సమ్మెకు పిలుపునివ్వడంతో పలువురు నేతలు, యాక్షన్‌ కమిటీ సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

దద్యాల్‌లో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిపై పోలీసులు దౌర్జన్యానికి వ్యతిరేకంగా పిఒకె అంతటా ముఖ్యంగా ముజఫరాబాద్‌లో పూర్తి షటర్‌ డౌన్‌, వీల్‌జామ్‌ సమ్మెను చేపట్టనున్నట్లు ముజఫరాబాద్‌ ట్రేడర్స్‌ అసోసియేషన్‌ చైర్మన్‌, కాశ్మీరీ సభ్యుడు షౌకత్‌ నవాజ్‌ మీర్‌ తెలిపారు. విద్యుత్‌ బిల్లులపై పన్నులు విధించడానిన తాము వ్యతిరేకిస్తున్నామని అన్నారు. హైడల్‌ విద్యుత్‌ ఉత్పత్తికి ధరకు అనుగుణంగా వినియోగదారులకు విద్యుత్‌ను అందించాలని డిమాండ్‌ చేస్తున్నారు. హింసతో యాక్షన్‌ కమిటీకి ఎలాంటి సంబంధం లేదని కమిటీ అధికార ప్రతినిధి హఫీజ్‌ హమ్దానీ పాక్‌ మీడియాకు తెలిపారు.

➡️