ఆధ్యాత్మిక రంగాల్లో రాజకీయ జోక్యం ఆమోదయోగ్యంకాదు : పూరీ శంకరాచార్య

న్యూఢిల్లీ :   ఆధ్యాత్మిక రంగాల్లో రాజకీయ జోక్యం ఆమోదయోగ్యం కాదని, రాజ్యాంగం కూడా ఈ విధానాన్ని అనుమతించదని పూరి శంకరాచార్య స్వామి నిశ్చలానంద సరస్వతి వ్యాఖ్యానించారు. జనవరి 22న అయోధ్యలో నిర్వహించే ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి తాను హాజరుకానని మరోసారి స్పష్టం చేశారు. శనివారం పశ్చిమబెంగాల్‌లోని గంగాసాగర్‌ మేళాలో మకర సంక్రాంతి సందర్భంగా పుణ్యస్నానాల్లో పాల్గొనేందుకు  వచ్చిన సందర్భంగా పూరీ శంకరాచార్య మీడియాతో మాట్లాడారు. పీఠాధిపతిగా తాను ఎక్కడికి వెళ్లాలి, ఏ విషయంలో జోక్యం చేసుకోవాలి. ఏమి తినాలి అనే విషయాల్లో కొన్ని పరిమితులు ఉంటాయని చెప్పారు.

” రాజకీయ నేతలకు పరిమితులు ఉన్నాయి. రాజ్యాంగం ప్రకారం వారికి నిర్దిష్టమైన బాధ్యతలు ఉంటాయి. మతపరమైన, ఆధ్యాత్మిక రంగాలకు కూడా నియమాలు, పరిమితులు ఉన్నాయి. వాటిని అనుసరించాల్సి వుంటుంది. రాజకీయ నేతలు ప్రతి రంగంలోనూ జోక్యం చేసుకోవడం పిచ్చితనం. రాజ్యాంగం ప్రకారం ఇది క్రూరమైన నేరం” అని అన్నారు. విగ్రహ ప్రతిష్టకు సంబంధించినంతవరకు గ్రంధాల ప్రకారం కొన్ని నిర్దిష్ట నియమాలు ఉన్నాయని, దేశాధ్యక్షుడైనా, ప్రధాని అయినా సరే వాటిని పాటించాల్సిందేననిస్పష్టం చేశారు. ప్రచారం కోసం ఈ నిబంధనలను అతిక్రమించడం తిరుగుబాటు చర్య అవుతుందని అన్నారు. ఆగస్ట్‌ 22న జరగనున్న రామమందిర ప్రారంభోత్సవానికి హాజరయ్యే విషయంలో నలుగురు శంకరా చార్యుల మధ్య ఎలాంటి విభేదాలు లేవని, ఆ కార్యక్రమానికి హాజరుకాకుండా తాను ఎవరినీ ఆపేది లేదని స్పష్టం చేశారు.

➡️