రాజస్థాన్‌లో పోలింగ్‌ ప్రారంభం

Nov 25,2023 08:48 #Polling, #Rajasthan, #start

జైపూర్‌ : రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ శనివారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ఈ పోలింగ్‌ ఈరోజు సాయంత్రం 6 గంటల వరకూ కొనసాగనుంది. మొత్తం 200 అసెంబ్లీ స్థానాలున్న రాజస్థాన్‌లో 199 నియోజకవర్గాల్లో ఒకే విడతలో పోలింగ్‌ నిర్వహిస్తున్నారు. ఒక నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్థి హఠాన్మరణంతో పోలింగ్‌ నిలిచిపోయింది. రాజస్థాన్‌లో దాదాపు 5 కోట్ల 26 లక్షల మంది ఓటర్లు గెహ్లాట్‌ సర్కార్‌ భవితవ్యాన్ని నిర్ణయించనున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు భారీ భద్రతా బలగాలను పోలీసులు మోహరించారు. డిసెంబర్‌ 3న ఫలితాలు వెల్లడికానున్నాయి. రాజస్థాన్‌ వ్యాప్తంగా 51 వేలకు పైగా పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఈసీ ప్రకటించింది. పట్టణ ప్రాంతాల్లో 10,501, గ్రామీణ ప్రాంతాల్లో 41 వేల 6 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేసింది. 26 వేలకు పైగా పోలింగ్‌ కేంద్రాల్లో లైవ్‌ వెబ్‌ కాస్టింగ్‌ ఏర్పాటు చేశారు. దీంతోపాటు ఎన్నికలు నిష్పాక్షికంగా జరిగేలా చూసేందుకు 6 వేల 287 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించినట్లు అధికారులు వెల్లడించారు. సుమారు 2 లక్షల 74 వేల మంది పోలింగ్‌ సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గంటున్నారు.

➡️