వ్యాజ్యాల నుంచి ఇసికి రక్షణ

supreme court on special team on ED misuse

చట్ట సవరణ తీసుకొచ్చిన కేంద్రం

న్యూఢిల్లీ : ప్రస్తుత, గతంలో పనిచేసిన ఎన్నికల కమిషన్‌ సభ్యులకు వ్యాజ్యాల నుంచి రక్షణ కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఓ సవరణ తీసుకొచ్చింది. దానికి ముందు ప్రధాన ఎన్నికల కమిషనర్‌ పైనే ఇటీవల పలు ఎఫ్‌ఐఆర్‌లు, వ్యాజ్యాలు దాఖలు కావడంపై కేంద్ర ఎన్నికల సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. ప్రధాన ఎన్నికల కమిషనర్‌, ఇతర కమిషనర్ల ఎంపిక, సర్వీసు నిబంధనల క్రమబద్ధీకరణకు సంబంధించిన బిల్లుపై రాజ్యసభలో ఈ నెల 12న చర్చ జరిగింది. ఆ తర్వాత న్యాయశాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌ ఓ సవరణను ప్రతిపాదించారు. అందులో సిఇసి, ఇసిలకు రక్షణ కల్పించేందుకు ఓ క్లాజును చేర్చారు. ఇటీవల సిఇసి, ఇసిలకు విచారణ కోర్టు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఈ సవరణ అవసరమైందని ఆయన తెలిపారు. ప్రధాన ఎన్నికల కమిషనర్‌, ఇతర ఎన్నికల కమిషనర్ల బిల్లును సవరణతో కలిపి సభ ఆమోదించింది. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ కానీ, ఇతర ఎన్నికల కమిషనర్లు కానీ తీసుకునే ఎలాంటి చర్య పైన అయినా న్యాయస్థానాలు సివిల్‌, క్రిమినల్‌ ప్రొసీడింగ్స్‌ చేపట్టకూడదని ఈ క్లాజు స్పష్టం చేస్తోంది. కేంద్రం ఈ క్లాజు తీసుకురావడానికి కారణం తెలంగాణలో జరిగిన ఓ ఉదంతమే. మహబూబ్‌నగర్‌లో దాఖలైన ఓ కేసుకు సంబంధించి ఎమ్మెల్యే, ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌, ఇతర ఎన్నికల కమిషనర్లపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని విచారణ కోర్టు ఆదేశించింది. సిఇసిని, ఇతర కమిషనర్లను ఈ కేసులో సహ నిందితులుగా చేర్చింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన రాష్ట్ర హైకోర్టు ఆ ఆదేశాలు ఇచ్చిన జడ్జిని సస్పెండ్‌ చేసింది. గత సంవత్సరం కర్ణాటకలో కూడా ఇదే తరహా ఘటన జరిగింది. 2019 ఎన్నికల కేసుకు సంబంధించి మాజీ సిఇసి సునీల్‌ అరోరాకు సింగిల్‌ జడ్జ్‌ బెంచ్‌ సమన్లు జారీ చేసింది. ఈ సమన్లను హైకోర్టు కొట్టివేసింది. రాజ్యాంగ బద్ధమైన పదవులలో ఉన్న వారికి లేదా మాజీలకు సమన్లు జారీ చేయకూడదని స్పష్టం చేసింది. 2021లో మద్రాస్‌ హైకోర్టు జడ్జి ఓ వ్యాఖ్య చేశారు. కోవిడ్‌ వ్యాప్తికి ఎన్నికల కమిషనే కారణమని, ఆ సమయంలో రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించిందని వ్యాఖ్యానించారు. ఎన్నికలు నిర్వహించిన అధికారులపై కేసు పెట్టాలని అన్నారు. దేశంలో 543 లోక్‌సభ, 4,123 శాసనసభ స్థానాలు ఉన్నాయి. ప్రతి స్థానంలో 10 నుండి 20 మంది పోటీ చేస్తుంటారు. కోటిన్నర మంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తారు.

➡️