రాహుల్‌, అఖిలేష్‌ సభకు పోటెత్తిన జనం

May 20,2024 08:15 #akilesh, #canceled, #meeting, #Rahul Gandhi
  • తొక్కిసలాట భయంతో ప్రసంగించకుండానే వెనుదిరిగిన నేతలు

లక్నో : కాంగ్రెస్‌ నాయకులు రాహుల్‌గాంధీ, సమాజ్‌ వాదీ పార్టీ అధ్యక్షులు అఖిలేష్‌ యాదవ్‌ సంయుక్తంగా పాల్గొంటున్న బహిరంగ సభకు జనం పోటెత్తారు. భద్రతా సిబ్బంది ఏర్పాటు చేసిన బ్యారికేడ్లు విరుచుకుంటూ నాయకులను చూసేందుకు అభిమానంతో ఎగబడ్డారు. భారీగా హాజరైన జనాన్ని చూసిన ఇద్దరూ నాయకులు ముందుగా సంతోషించినా.. తొక్కిసలాట జరుగుతుందనే భయంతో సభలో ఎక్కువ సేపు ఉండకుండా, ప్రసంగించకుండానే వెనుదిరిగారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని ప్రయగ్‌రాజ్‌ జిల్లాలో ఫుల్పార్‌ పట్టణంలో జరిగింది. రాహుల్‌, అఖిలేష్‌ వేదిక వద్దకు చేరుకోగానే కాంగ్రెస్‌, ఎస్‌పి మద్దతుదారులు తమ నాయకులను చూడ్డానికి ఎగబడ్డారు. నిర్వాహకులు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా జనం వెనక్కితగ్గలేదు. దీంతో రాహుల్‌, అఖిలేష్‌ కొద్దిసమయం ఒకరితో ఒకరు చర్చించుకుని వేదిక నుంచి వెళ్లిపోయారు. నాయకులు ఇద్దరికీ భద్రతా సిబ్బంది వలయంగా ఏర్పడి వారిని సభ నుంచి బయటకు పంపించారు.
ఫుల్పార్‌ లోక్‌సభ స్థానం నుంచి పోటి చేస్తున్న ఎస్‌పి అభ్యర్థి అమర్‌నాథ్‌కు మద్దతుగా ఈ సభ జరగాల్సి ఉంది. రాహుల్‌-అఖిలేష్‌ యాదవ్‌ సభకు వచ్చిన భారీ జనాన్ని చూసి బిజెపిలో ఆందోళన మొదలైందని కాంగ్రెస్‌, ఎస్‌పి నాయకులు వ్యాఖ్యానించారు. ఇండియా వేదికకు ప్రజల్లో ఉన్న ఆదరణకు ఇది నిదర్శనమని అన్నారు.

➡️