పార్లమెంటులో నోరు నొక్కేస్తున్నారు…

Jan 6,2024 15:22 #Congress, #padayatra, #Rahul Gandhi

కాంగ్రెస్‌ నేత ఖర్గే

‘భారత్‌ జోడో న్యాయ యాత్ర’ లోగో ఆవిష్కరణ

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : పార్లమెంట్‌లో ప్రజా సమస్యలను లేవనెత్తడానికి ప్రభుత్వం అవకాశం ఇవ్వనందునే తమ పార్టీ ‘భారత్‌ జోడో న్యాయ యాత్ర’ను చేపడుతున్నట్లు కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే తెలిపారు. ఎఐసిసి కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ఈ నెల 14 నుంచి చేపడుతున్న ‘భారత్‌ జోడో న్యారు యాత్ర’ ‘న్యారు కా హక్‌ మిల్నే తక్‌’ లోగోతోపాటు నినాదాన్ని ఖర్గే, ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) కెసి వేణుగోపాల్‌, ప్రధాన కార్యదర్శి (కమ్యూనికేషన్స్‌) జైరామ్‌ రమేష్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మల్లికార్జున్‌ ఖర్గే మాట్లాడుతూ ఈ యాత్ర దేశంలోని ప్రాథమిక సామాజిక, రాజకీయ, ఆర్థిక సమస్యలపై దృష్టి పెడుతుందని చెప్పారు. ఇండియా ఫోరం నాయకులు, పౌర సమాజ సభ్యులను కూడా మార్చ్‌లో పాల్గొనడానికి ఆహ్వానించామని ఆయన తెలిపారు. కన్యా కుమారి నుంచి కాశ్మీర్‌ వరకు భారత్‌ జోడో యాత్ర విజయవంతమైందని గుర్తు చేశారు. భారత్‌ జోడో న్యారు యాత్ర మణిపూర్‌లోని ఇంఫాల్‌ నుంచి ప్రారంభమై ముంబయిలో ముగుస్తుందన్నారు. ”పార్లమెంటులో ప్రజా సమస్యలను లేవనెత్తడానికి ప్రభుత్వం మాకు అవకాశం ఇవ్వలేదు. అందుకే కాంగ్రెస్‌ భారత్‌ జోడో న్యారు యాత్రను చేపడుతోంది. మేము ఈ వేదిక (యాత్ర) ద్వారా ప్రజల సమస్యలను వింటాము” అని ఖర్గే అన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రతిపక్ష నేతలను బెదిరించేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌, ఆదాయపు పన్ను శాఖ వంటి ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు. కొత్త కార్మిక చట్టాలు, క్రిమినల్‌ చట్టాలు నియంతృత్వ సంకేతాలను చూపుతున్నాయని ఖర్గే అన్నారు. మణిపూర్‌లో ఘటనలు దురదృష్టకరమని చెప్పారు.

  • ఈ గొప్పవ్యక్తి మణిపూర్‌ మాత్రం వెళ్లరు

”బీచ్‌లకు వెళ్తారు. ఫోటో సెషన్‌ స్క్రీమింగ్‌ నడుస్తుంది. ఆలయ నిర్మాణ ప్రాంతంలో ఫొటోలు దిగుతారు. కేరళ, ముంబాయి వెళ్తారు. వెళ్లిన ప్రతిచోటా ఫోటోలు దిగుతూనే ఉంటారు. ఈ గొప్ప వ్యక్తి మణిపూర్‌కు మాత్రం వెళ్లరు” అంటూ ప్రధాని మోడీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 22న రామ మందిర ప్రతిష్ఠాపన కార్యక్రమానికి తనకు ఆహ్వానం అందిందని, త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. ఇండియా ఫోరం కన్వీనర్‌పై మీడియా అడిగిన ప్రశ్నకు….’ఇది కౌన్‌ బనేగా కరోడ్‌పతి ప్రశ్న’ అంటూ ఆయన నవ్వుతూ చమత్కరించారు. కెసి వేణుగోపాల్‌ మాట్లాడుతూ, తమకు ప్రజల వద్దకు వెళ్లడం మినహా మార్గం లేదనే విషయం ప్రజలకు ఈ యాత్ర ద్వారా తెలియజేస్తామన్నారు. పార్లమెంటులో పలు అంశాలను లేవనెత్తాలని ప్రయత్నించినప్పటికీ తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని, ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు 146 మంది ప్రతిపక్ష ఎంపిలను పార్లమెంట్‌ నుంచి గెంటివేసిందని అన్నారు. భారత్‌ జోడో న్యారు యాత్ర ఈ నెల 14 న ప్రారంభమై 6,713 కి.మీ మేర సాగి, మార్చి20న ముంబయిలో ముగుస్తుంది. 66 రోజులపాటు మొత్తం 15 రాష్ట్రాలు, 110 జిల్లాలు, వంద లోక్‌సభ స్థానాలు, 337 అసెంబ్లీ నియోజకవర్గాలను ఇది కవర్‌ చేస్తుంది.

➡️