మమత కోటలో ‘సైరా’

May 4,2024 03:44 #2024 election, #Kolkata
  •  కలకత్తా దక్షిణ స్థానంలో సిపిఎం నుంచి పోటీ
  •  కాంగ్రెస్‌, లెఫ్ట్‌ మద్దతు
  •  టిఎంసి నుంచి సిట్టింగ్‌ ఎంపి మాలా రాయ్

మమత బెనర్జీ అడ్డా కలకత్తా దక్షిణ లోక్‌సభ నియోజకవర్గంలో సిపిఎం జెండా పాతేందుకు సైరా షా హలీమ్‌ కష్టపడుతున్నారు. అక్కడి రాజకీయ దృశ్యాన్ని మార్చేందుకు సిపిఎం అభ్యర్థిగా అమె బరిలోకి దిగారు. ఆమె అంటే టిఎంసికిఎంత భయమంటే, మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్‌ బెనర్జీ నివాసం ఉంటున్న వీధుల్లోకి ప్రచారానికి వెళ్లకుండా సైరా షా హలీమ్‌ ను అడ్డుకున్నారు. 2022లో బాలిగంజ్‌ ఉప ఎన్నికల్లో హలీమ్‌ ఓడిపోయినా, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో 5 శాతంగా ఉన్న సిపిఎం ఓట్ల శాతాన్ని 30 శాతానికి పెంచారు. బిజెపి మూడో స్థానానికి పడిపోయింది.

నసీరుద్దీన్‌షా మేనకోడలు
హలీమ్‌ ప్రముఖ నటుడు నసీరుద్దీన్‌ షా మేనకోడలు. ఆమె తండ్రి లెఫ్టినెంట్‌ జనరల్‌ (రిటైర్డ్‌) జమీర్‌ ఉద్దీన్‌ షా. సిపిఎం నాయకుడు, మాజీ స్పీకర్‌ హషీమ్‌ అబ్దుల్‌ హలీమ్‌ కుమారుడు డాక్టర్‌ ఫువాద్‌ హలీమ్‌ ఆమె భర్త. సైరా షా హలీమ్‌ కలకత్తాలో జన్మించినప్పటికీ , ఆమె తండ్రి ఆర్మీ నేపథ్యం ఆమెను పంజాబ్‌, మణిపూర్‌, నాగాలాండ్‌, తమిళనాడు (ఊటీ)లలో విద్యనభ్యసించారు. రియాద్‌లో రెండేళ్లు ఉన్నారు. ఆమె తండ్రి గల్ఫ్‌లో దేశ రక్షణ తరపున నియమితులయ్యారు. అజ్మీర్‌లోని సోఫియా గర్ల్స్‌ కాలేజీలో గ్రాడ్యుయేట్‌, ఆంగ్ల సాహిత్యంలో మాస్టర్స్‌ చేసిన హలీమ్‌, సోషల్‌ వర్క్‌ వైపు మొగ్గు చూపడానికి ముందు పలు సంస్థల్లో పని చేశారు. కలకత్తాలో ఎన్‌ఆర్‌సి, సిఎఎ వ్యతిరేక నిరసనలలో పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో కలకత్తా దక్షిణ నుంచి సిపిఎం నుంచి సైరా షా హలీమ్‌ బరిలోకి దిగగా టిఎంసి నుంచి మాలా రారు, బిజెపి నుంచి కేంద్ర మంత్రి దేబశ్రీ చౌదరి పోటీ చేస్తున్నారు. ‘గతసారి మేము ప్రధానంగా బిజెపి డబ్బుపై పోటీ ఇచ్చాం. ఈసారి మేము అవినీతి టిఎంసి, ఫాసిస్ట్‌ బిజెపి రెండింటినీ ఓడిస్తాము’ అని కాళీఘాట్‌ వద్ద ప్రచారంలో సైరా షా హలీమ్‌ తెలిపారు.

ఎన్నో పాఠాలు
లోక్‌సభ ఎన్నికలు పూర్తిగా భిన్నమైన బాల్‌ గేమ్‌. గతంలోనిది అసెంబ్లీ నియోజకవర్గానికి ఎన్నిక. ఈసారి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు. అలాగే, ఈ ప్రాంతం మమతా బెనర్జీకి అత్యంత ప్రతిష్టాత్మకం. ఇక్కడ గతంలో మమత గెలిచారు. ఇక్కడ ప్రస్తుత ఎంపిగా మాలా రారు ఉన్నారు. సవాలుతో కూడుకున్న భూభాగం. కానీ, పుట్టగొడుగుల్లా విస్తరిస్తున్న అక్రమ నిర్మాణాలు, నియోజకవర్గాన్ని పట్టి పీడిస్తున్న వివిధ వ్యాధులు, నిరుద్యోగం వంటి అనేక సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నది సైరా షా ప్రచారంలోని ముఖ్యాంశాలు.’సిఎఎ, ఎన్‌ఆర్‌సి నిరసనల్లో కావచ్చు, ప్రతి ఒక్కరి హక్కుల గురించి నేను గొంతెత్తాను. ఏదైనా ముఖ్యమైన బిల్లు ఆమోదం పొందాల్సి వస్తే వాకౌట్‌ చేయడం వల్ల ఉపయోగమేంటీ? సిఎఎ ఆమోదం పొందుతున్న సమయంలో టిఎంసి ఎంపిలు వాకౌట్‌ చేశారు. వారి హాజరు పేలవంగా ఉంది. కాబట్టి, నా అభిప్రాయం ప్రకారం, అటువంటి అభ్యర్థులు నిరోధకులుగా ఉంటారు. నా నియోజకవర్గ ప్రజలు నన్ను ఎన్నుకోవాలని నిర్ణయించుకుంటే, నేను పార్లమెంటేరియన్‌గా ఉండి ప్రజలకు అండగా నిలుస్తాను’ అంటున్నారు సైరా షా.

ఉప ఎన్నికల్లో నైతిక విజయం
బల్లిగంజ్‌ ఎమ్మెల్యే సుబ్రతా ముఖర్జీ మరణించిన నేపథ్యంలో 2022లో జరిగిన ఉప ఎన్నిక ఆసక్తికరంగా మారింది . నగరం నడిబొడ్డుగా భావించే బల్లిగంజ్‌ ఎన్నికలు సైరా షా మొదటి ఎన్నికల ప్రయాణం. బిజెపిని, టిఎంసిలపై పోరాడి గెలుపుకు దగ్గరగా వచ్చారు. కొన్ని బూత్‌లలో అవకతవకలు, అక్రమాలు, దౌర్జన్యాలు జరగకపోతే తనదే గెలుపని, తనదే నైతిక విజయమని సైరా షా చెప్పారు. ‘ ప్రజలు నాపై, నా పార్టీపై ప్రేమ, ఆప్యాయతలను కురిపించారు” అని అన్నారు.

నాన్‌ లోకల్‌ కాదు.. కలకత్తా అమ్మాయిని
నాన్‌లోకల్‌ అనే ప్రత్యర్థుల విమర్శలను ఆమె తిప్పి కొట్టారు. ‘ఈ ప్రాంతంలోని యువతతో నాకు చాలా అనుబంధం ఉంది. ప్రజా ఉద్యమాలలో భాగస్వామ్యం అయ్యాను. కాబట్టి నా అభ్యర్థిత్వంలో బయటి వ్యక్తి అనే వారికి ఇదే నా సమాధానం. నేను కలకత్తా అమ్మాయిని. మా నాన్న యువ కెప్టెన్‌గా ఇక్కడకు వచ్చినప్పుడు నేను కలకత్తాలో పుట్టాను. ఆర్మీ మేన్‌ కూతురినైన నాకు దేశంలోని వివిధ ప్రాంతాల్లో పెరిగే అవకాశం కూడా ఉంది’ అన్నారు. ఇండియా ఫోరంలో భాగంగా తనకు కాంగ్రెస్‌ మద్దతిస్తోందని, ఇతర వామపక్ష పార్టీలు సైతం మద్దతిస్తున్నాయన్నారు.

జె.జగదీష్‌

➡️