ఎస్‌బిఐపై మళ్లీ సుప్రీం ఆగ్రహం

  • బాండ్ల నంబర్లు వెల్లడికి డెడ్‌లైన్‌
  • 21లోగా ఇవ్వాల్సిందే
  • సమాచారాన్ని దాచిపెట్టలేదని అఫిడివిట్‌ దాఖలు చేయాలని ఆదేశం

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఎలక్టోరల్‌ బాండ్ల సమాచారాన్ని వెల్లడించే విషయంలో నాన్చుడు ధోరణిని అనుసరిస్తున్న స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా (ఎస్‌బిఐ)పై సుప్రీంకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. తాము ఆదేశించిన ప్రకారం పూర్తి వివరాలు ఎందుకు ఇవ్వడం లేదని నిలదీసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డివై చంద్రచూడ్‌ నేతృత్వంలో న్యాయమూర్తులు సంజీవ్‌ ఖన్నా, బిఆర్‌ గవారు, జెబి పార్దివాలా, మనోజ్‌ మిశ్రాతో కూడిన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం సోమవారం ఈ అశంపై విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఎస్‌బిఐ అనుసరిస్తున్న వైఖరిపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన ధర్మాసనం బాండ్లపై ఉండే యూనిక్‌ నంబర్లతో సహా అన్ని వివరాలను 21వ తేదిలోగా ఎన్నికల కమిషన్‌కు అందచేయాలని ఆదేశించింది. ‘ఏవో వివరాలు సెలక్టివ్‌గా అందచేస్తే సరిపోదు. మీరు కూడా సెలక్టివ్‌గా ఉండకండి’ అని సూచించింది.ఒక దశలో మీరు ఏ రాజకీయ పార్టీ తరపున హాజరుకాలేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని ఎస్‌బిఐ తరుపు న్యాయవాది నుద్ధేశించి పేర్కొంది. ఏ కంపెనీ ఏ రాజకీయ పార్టీకి ఎంత నిధులు ఎలక్టోరల్‌ బాండ్ల ద్వారా ఇచ్చిందో పూర్తిస్థాయిలో బహిర్గతం చేయాల్సిందేనని, బాండ్ల నెంబర్లతో సహా అన్ని వివరాలనూ ఎన్నికల కమిషన్‌కు అందజేయాలని ధర్మాసనం స్పష్టం చేసింది. బాండ్లపై ఉండే యూనిక్‌ నెంబర్లను కూడా ఎన్నికల కమిషన్‌కు అందజేయాలని తాము గతంలో ఆదేశించానని గుర్తు చేస్తూ వాటిని ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించింది. బాండ్ల నెంబర్లతో సహా అన్ని వివరాలనూ ఈ నెల 21వ తేదీ లోగా ఎన్నికల కమిషన్‌కు అందజేయాలని, అదే విధంగా ఏ సమాచారాన్నీ దాచిపెట్టలేదని పేర్కొంటూ అదే రోజు సాయంత్రం ఐదు గంటల లోగా న్యాయస్థానంలో అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. ఎస్‌బిఐ నుండి పూర్తి వివరాలు అందిన వెంటనే ఎన్నికల కమిషన్‌ తన వెబ్‌సైటులో వాటన్నింటినీ అప్‌లోడ్‌ చేయాలని ఆదేశించింది. ‘2019 ఏప్రిల్‌ 12వ తేదీన మేము మధ్యంతర ఆదేశాలు జారీ చేశాము. ఆ రోజు నుండి జారీ చేసిన బాండ్ల వివరాలను ఎన్నికల కమిషన్‌కు అందజేయాలని మీకు స్పష్టం చేశాం. మధ్యంతర ఆదేశాలు జారీ చేసినప్పటి నుండి ఎన్నికల బాండ్ల ద్వారా విరాళాలు పొందిన రాజకీయ పార్టీల వివరాలు కూడా ఇసికి అందజేయాలని చెప్పాము. ఏ పార్టీ, ఏ తేదీన బాండ్లను నగదుగా మార్చుకుంది? దాని విలువ ఎంత? అనే సమాచారాన్ని కూడా మీరు అందచేయాల్సిఉంది. ఫిబ్రవరి 15వ తేదీన ఇచ్చిన తీర్పులో సైతం ఇదే విషయాన్ని స్పష్టంగా తెలియజేశాము, మరో మాటలో చెప్పాలంటే ఎస్‌బిఐ తన వద్ద ఉన్న వివరాలన్నింటినీ పూర్తిగా బహిర్గతం చేయాల్సిందే. అందులో సందేహమే లేదు’ అని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసిందిఎస్‌బిఐ తరఫున హాజరైన సీనియర్‌ న్యాయవాది హరీష్‌ సాల్వే ధర్మాసనం ఆదేశాలపై స్పందిస్తూ వివరాలు సమర్పించడానికి బ్యాంకుకు అభ్యంతరాలేమీ లేవని తెలియజేశారు. సాల్వే స్టేట్‌మెంటును న్యాయస్థానం నమోదు చేసుకుంది.

➡️