సెల్ఫీకీ జిఎస్‌టి కట్టాలేమో..! : స్టాలిన్‌

Apr 16,2024 22:51 #BJP, #coments, #M.K. Stalin
  • ఆయనో ‘వసూల్‌ రాజ్‌’
  •  బాండ్లతో వేల కోట్లు దండుకున్నారు
  •  బిజెపి మ్యానిఫెస్టో పౌరుల పాలిట విలన్‌
  • ప్రధాని మోడీపై స్టాలిన్‌ ఆగ్రహం

ప్రజాశక్తి – చెన్నయ్ : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఓ ‘వసూల్‌ రాజ్‌’ అని తమిళనాడు ముఖ్యమంత్రి, డిఎంకె అధ్యక్షులు ఎంకె స్టాలిన్‌ విమర్శించారు. ఎన్నికల బాండ్ల ద్వారా మోడీ కోట్లాది రూపాయలు దోచుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెపి ప్రయోజనాల కోసం కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెన్నరులో సోమవారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో స్టాలిన్‌ ప్రసంగిస్తూ దేశం అనేకమంది ప్రధానులను చూసిందని, అయితే రాజకీయ పార్టీలను చీల్చేందుకు, ఎమ్మెల్యేలు, ఎంపీలను కొనుగోలు చేసేందుకు, ముఖ్యమంత్రులను అరెస్ట్‌ చేసేందుకు నరేంద్ర మోడీ మాత్రమే ఇడి, సిబిఐ, ఆదాయపన్ను వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారని తప్పుబట్టారు.
వ్యాపార సంస్థలను బెదిరించడానికి దర్యాప్తు సంస్థలను మోడీ వాడుకుంటున్నారని, ఎన్నికల బాండ్ల ద్వారా డబ్బు దండుకున్నారని, పీఎం కేర్స్‌ ఫండ్‌ ద్వారా డబ్బు పొందేందుకు ప్రత్యేకంగా ఓ ట్రస్టును ఏర్పాటు చేశారని స్టాలిన్‌ దుయ్యబట్టారు. బిజెపి ఎన్నికల ప్రణాళికపై కూడా ఆయన విమర్శనాస్త్రాలు సంధిస్తూ అది దేశం, పౌరుల పాలిట ‘విలన్‌’ అని వ్యాఖ్యానించారు. బిజెపి మ్యానిఫెస్టోలో వాస్తవికత లేదని ఆయన చెప్పారు. ‘అది కేవలం ప్రజలను విభజించేది మాత్రమే కాదు. వారిని వెర్రివాళ్లను చేసేందుకు ప్రయత్నించింది. 2019లో మాదిరిగా ఇప్పుడు కూడా తన హామీలను పునరుద్ఘాటించింది. రూపాయికే శానిటరీ నాప్‌కిన్స్‌ను అందజేస్తానని అప్పుడు చెప్పింది. అయితే వాస్తవమేమంటే వాటి పైన కూడా జీఎస్టీ విధించింది’ అని ఎద్దేవా చేశారు.
జిఎస్‌టిని పేదలను దోచుకునే సాధనంగా అంతకుముందు స్టాలిన్‌ సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో అభివర్ణించారు. రాబోయే కాలంలో సెల్ఫీ తీసుకున్నా జీఎస్టీ విధిస్తారని వ్యంగ్యంగా అన్నారు. ద్విచక్ర వాహనానికి మరమ్మతు చేసే సమయంలో హోటల్‌ నుండి తెచ్చుకునే ఆహార పదార్థాలపై సైతం పన్ను వడ్డిస్తారేమోనని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ‘రెస్టారెంట్లలో ఆహార బిల్లుల్లో జిఎస్‌టిని చూస్తున్న మధ్యతరగతి కుటుంబాలు గబ్బర్‌సింగ్‌ పన్నుతో విలవిలలాడుతున్నారు. తర్వాత ఏమిటి? సెల్ఫీకి కూడా జీఎస్టీ వర్తిస్తుందా? రూ.1.45 లక్షల కోట్ల కార్పొరేట్‌ పన్నును రద్దు చేసిన బిజెపి ప్రభుత్వం పేదలపై కనికరం చూపలేదా?’ అని స్టాలిన్‌ ప్రశ్నించారు.

➡️