Sikkim: సిక్కింలో 15 మంది పర్యాటకులను రక్షించిన సహాయక సిబ్బంది ..

గ్యాంగ్‌టక్‌ : సిక్కింలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ఉత్తర సిక్కింలోని లాచౌంగ్‌ ప్రాంతంలో సుమారు 1200 మంది పర్యాటకులు చిక్కుకుపోయారు. సిక్కింలోని లాచుంగ్‌ సహా సమీప ప్రాంతాల్లో చిక్కుకుపోయిన 15 మందికి పైగా పర్యాటకులను మంగళవారం రక్షించినట్లు మంగన్‌ జిల్లా అధికారులు తెలిపారు. బోర్డర్‌ రోడ్స్‌ ఆర్గనైజేషన్‌ (బిఆర్‌ఒ), స్టేట్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌ (ఎస్‌డిఆర్‌ఎఫ్‌), జాతీయ విపత్తు నిర్వహణ బృందం (ఎన్‌డిఆర్‌ఎఫ్‌) సహా స్వచ్ఛంద సేవకులు సహాయక చర్యల్లో పాల్గంటున్నారు. చిక్కుకుపోయిన డజన్ల కొద్దీ పర్యాటకులను సురక్షిత ప్రాంతాలకు తరలించామని చెప్పారు.
జూన్‌ 12 నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు మంగన్‌లో విధ్వంసం సృష్టించాయి. కొండచరియలు విరిగిపడటంతోపాటు పలు ప్రాంతాలకు ఇంటర్నెట్‌, ఇతర సదుపాయాలు నిలిచిపోయాయి. ఇప్పటివరకు ఆరుగురు మరణించినట్లు అధికారులు తెలిపారు.
పాఠశాలలకు సెలవులు
తీవ్రంగా ప్రభావితమైన మాంగన్‌ జిల్లాలో చిన్నపాటి చెక్క వంతెనలు ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు. ఈ ప్రాంతంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.

➡️