బీచ్‌ రిసార్ట్‌ టౌన్‌ను స్వాధీనం చేసుకున్న మయన్మార్‌ సాయుధ గ్రూపులు

Jun 26,2024 23:05 #beach resort town, #Myanmar, #seize

జుంటా స్థావరాలపై దాడులు
యాంగాన్‌ : మయన్మార్‌కు పశ్చిమాన గల బీచ్‌ రిసార్ట్‌ పట్టణాన్ని సాయుధ గ్రూపులు స్వాధీనం చేసుకుని, ఉత్తర ప్రాంతంలోని జుంటా స్థావరాలపై తెల్లవారు జామునే దాడులు ఆరంభించాయని మిలటరీ వర్గాలు తెలిపాయి. గిరిజన సాయుధ గ్రూపులు, ప్రజాస్వామ్య అనుకూల వర్గాలైన పీపుల్స్‌ డిఫెన్స్‌ ఫోర్సెస్‌ కలిసి సైన్యంపై పోరాటాన్ని సాగిస్తున్నాయి. 2021లో కుట్ర ద్వారా సైన్యం అధికారాన్ని చేజిక్కించుకుంది. పశ్చిమ రఖీనె రాష్ట్రంలో ఆర్కాన్‌ ఆర్మీ (ఎఎ) ఫైటర్లు ఎన్‌గపాలి బీచ్‌ వద్ద భద్రతా బలగాలతో రోజుల తరబడి పోరు సల్పుతున్నాయి. ఈ బీచ్‌ రిసార్టులో మిలిటరీ మద్దతు కలిగిన వ్యాపారాలు, వాణిజ్య కేంద్రాలు, హోటళ్ళు వున్నాయి. ఈ దాడులతో దాదాపు రెండు కిలోమీటర్ల దూరంలో వున్న తాండ్వె పట్టణానికి జుంటా బలగాలు, పోలీసులు పలాయనం చిత్తగించాయి. అక్కడకు వందల కిలోమీటర్ల దూరంలో ఉత్తర షాన్‌ రాష్ట్రంలోని కయూక్మె పట్టణంలో మిలటరీపై తాంగ్‌ నేషనల్‌ లిబరేషన్‌ ఆర్మీ (టిఎన్‌ఎల్‌ఎ) దాడులు ఆరంభించిందని స్థానికులు తెలిపారు. ఉదయం నుండి తుపాకులు, శతఘ్నుల కాల్పుల శబ్దాలు వినిపిస్తున్నాయని, ప్రజలు చాలామంది ఇళ్ళల్లో దాక్కుని వుండిపోయారని తెలిపారు. పట్టణంలో తిరగకుండా టిఎన్‌ఎల్‌ఎ ఆంక్షలు విధించిందన్నారు. పెద్ద మొత్తంలో భూభాగాన్ని ఆక్రమించిన ఫైటర్లు, చైనాతో గల వాణిజ్య క్రాసింగ్‌లను కూడా స్వాధీనం చేసుకున్నారు. అధికారాన్ని ఆక్రమించిన తర్వాత జుంటాకు ఇది పెద్ద ఎదురుదెబ్బ. రాఖినె రాష్ట్రంలోని ఎన్‌గపాలి బీచ్‌కు కొద్ది కిలోమీటర్ల దూరంలో గల తాండ్వె పట్టణం సోమవారానికే నిర్మానుష్యంగా మారింది. పట్టణంలోని ప్రతి ఒక్కరూ పారిపోయారు.

➡️