నీట్‌ను ఎత్తివేయాలి- ప్రధాని మోడీ, రాహుల్‌కు స్టాలిన్‌ లేఖ

అలాగే ఎనిమిది రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కూడా..
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :నీట్‌ కుంభకోణం దేశవ్యాపితంగా విద్యార్థులను, వారి తల్లిదండ్రులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్న నేపథ్యంలో ఈ నీట్‌ పరీక్షా విధానం నుంచి తమిళనాడును మినహాయించాలని ప్రధాని నరేంద్రమోడీకి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్‌ లేఖ రాశారు. అలాగే ఈ జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్‌)ను ఎత్తివేయాలని కూడా ఆయన ఆ లేఖలో కోరారు.. ఆదే సమయంలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీకి, ఎనిమిది రాష్ట్రాల ముఖ్యమంత్రులకు తమిళనాడు ముఖ్యమంత్రి ఇదే విషయమై లేఖలు రాశారు. నీట్‌ మినహాయింపు కోసం తమిళనాడు చేస్తున్న డిమాండ్‌కు మద్దతు ఇవ్వాలని రాహుల్‌కు రాసిన లేఖలో ఆయన కోరారు. తమిళనాడు అసెంబ్లీ తీర్మానం చేసినట్లుగానే మీ రాష్ట్రాల అసెంబ్లీల్లో నీట్‌ రద్దుకు తీర్మానాలు చేయాలని తెలంగాణ, కర్ణాటక, కేరళ, ఢిల్లీ, హిమాచల్‌ ప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌, జార్ఖండ్‌, పంజాబ్‌ ముఖ్యమత్రులకు ఆయన విజ్ఞప్తి చేశారు. వృత్తిపరమైన కోర్సుల అడ్మిషన్లు ప్రత్యేక ప్రవేశ పరీక్షతో కాకుండా 12వ తరగతి మార్కుల ఆధారంగా చేపట్టే పాత విధానాన్నే పునరుద్ధ్ధరించాలని స్టాలిన్‌ ప్రధానిని కోరారు. నీట్‌ అనేది విద్యార్థులపై అనవసరమైన అదనపు ఒత్తిడి అని ఆరోపించారు. ‘ఈ ఎంపిక ప్రక్రియను తొలగించాల్సిన అవసరంపై ఇతర రాష్ట్రాలు కూడా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నాయి’ అని ఆ లేఖలో పేర్కొన్నారు. . నీట్‌ను రద్దు చేయాలని కోరుతూ అసెంబ్లీ చేసిన బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం పంపగా, కేంద్రం పెండింగ్‌లో పెట్టిందని ఆయన గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆ బిల్లుకు ఆమోదం తెలపాలని ఆయన కోరారు.

➡️