Supreme Court: కేజ్రీవాల్‌ కేసులో ఇడికి సుప్రీం నోటీసులు

  •  24లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశం

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఢిల్లీ మద్యం పాలసీ కేసులో జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ దాఖలు చేసిన పిటిషన్‌లో ఇడికి అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. ఈనెల 24లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. కేసు విచారణను 29న విచారణ జరపనుంది. అయితే మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్‌కు సత్వర ఉపశమనం కల్పించేందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు నిరాకరించింది. ఇడి అరెస్టును సవాల్‌ చేస్తూ అరవింద్‌ కేజ్రీవాల్‌ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను సోమవారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తాల కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. అరవింద్‌ కేజ్రీవాల్‌ తరపున సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా కేజ్రీవాల్‌ను అరెస్టు చేశారని ఆరోపించారు. కేసు తదుపరి విచారణను వేగవంతం చేయాలని కోరారు. అయితే ఈ నెల 29లోపు విచారణ జరపలేమని కోర్టు తెలిపింది. ఈ నెల 19న విచారణకు జాబితా చేయాలని కోరగా.. ధర్మాసనం ఇందుకు నిరాకరిస్తూ 29న విచారణకు జాబితా చేసింది.
23 వరకు కేజ్రీవాల్‌ కస్టడీ పొడిగింపు
ఢిల్లీ ఎక్సైజ్‌ పాలసీకి చెందిన మనీ లాండరింగ్‌ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రస్తుతం ఉన్న జ్యుడీషియల్‌ కస్టడీని ఈ నెల 23 వరకు పొడిగిస్తున్నట్లు రౌస్‌ అవెన్యూ కోర్టు తెలిపింది. స్పెషల్‌ జడ్జి కావేరి బవేజా ఈ కేసులో సోమవారం ఆదేశాలు జారీ చేశారు. 23న కేజ్రీవాల్‌ను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా హాజరుపరుచాలని కోర్టు తెలిపింది. ఈ కేసులో ఆయనను మార్చి 21న ఇడి అరెస్టు చేసింది.
కేజ్రీవాల్‌ను జైల్లో కరడుగట్టిన నేరస్తుడిలా ట్రీట్‌ చేస్తున్నారు : పంజాబ్‌ సిఎం
ఢిల్లీ మద్యం కేసులో అరెస్టై తీహార్‌ జైల్లో ఉన్న ఢిల్లీ సిఎం, ఆప్‌ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ను నేరస్తుడిలా ట్రీట్‌ చేస్తున్నారని పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ అన్నారు. సోమవారం తీహార్‌ జైల్లో ఉన్న కేజ్రీవాల్‌ను ఆయన కలిశారు. ఒక గ్లాస్‌ వాల్‌ గుండా ఫోన్‌లో కేజ్రీతో మాట్లాడారు. దాదాపు 30 నిమిషాల పాటు వీరు ఫోన్‌లో మాట్లాడుకున్నారు. కేజ్రీవాల్‌తో భేటీ అనంతరం భగవంత్‌ మాన్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘నేను కేజ్రీవాల్‌ను అలా చూసి ఉద్వేగానికి లోనయ్యాను. ఆయనను అక్కడ ఓ కరుడుగట్టిన నేరస్తుడిలా ట్రీట్‌ చేస్తున్నారు. క్రిమినల్స్‌కు దక్కే సౌకర్యాలు కూడా కేజ్రీవాల్‌కు ఇవ్వడం లేదు’ అని విమర్శించారు.

➡️