ఎలక్ట్రానిక్‌ ఆధారాల ప్రతులు ఇవ్వరేం ?

supreme court on bhima koregaon case electrical documents

భీమా కోరేగావ్‌ కేసులో ఎన్‌ఐఎపై సుప్రీం ఆగ్రహం

న్యూఢిల్లీ : భీమా కోరేగావ్‌ కేసులో నిందితుడైన మానవ హక్కుల కార్యకర్త గౌతమ్‌ నవ్‌లాఖాకు ఎలక్ట్రానిక్‌ ఆధారాలకు సంబంధించిన ప్రతులను ఎందుకు ఇవ్వడం లేదని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ)ను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఆ పత్రాల ఆధారంగానే ఎన్‌ఐఎ దర్యాప్తు జరుపుతోందని, అయితే వాటి ప్రతులను నిందితుడికి అందజేయడంలో ఆ సంస్థ విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు అనేక ఆదేశాలు జారీ చేసినప్పటికీ సిఆర్‌పిసిలోని సెక్షన్‌ 207ను దర్యాప్తు సంస్థ ఖాతరు చేయడం లేదని ప్రత్యేక న్యాయమూర్తి రాజేష్‌ కటారియా తప్పుపట్టారు. ప్రాసిక్యూషన్‌ ఏ ఆధారాలను బట్టి విచారణ జరుపుతోందో వాటి ప్రతులను నిందితులకు అందజేయాలని ఈ సెక్షన్‌ నిర్దేశిస్తోంది. పూనే సమీపంలోని ఓ గ్రామంలో 2018లో జరిగిన కుల ఘర్షణల కేసులో (భీమా కోరేగావ్‌ కేసు) నవ్‌లాఖాసహా 16 మందిని చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద అరెస్ట్‌ చేశారు. గత సంవత్సరం డిసెంబర్‌ 19న బాంబే హైకోర్టు ఆయనకు బెయిల్‌ మంజూరు చేసినప్పటికీ దానిపై స్టే ఇచ్చింది. విచారణ అధికారులు తన వద్ద నుండి స్వాధీనం చేసుకున్న ఎలక్ట్రానిక్‌ పరికరాలకు సంబంధించిన ఆధారాల ప్రతులను తనకు అందజేసేలా ఎన్‌ఐఎను ఆదేశించాలని నవ్‌లాఖా కోర్టును అభ్యర్థించారు. దీనిపై న్యాయస్థానంలో విచారణ జరుగుతోంది. ఫోరెన్సిక్‌ సైన్స్‌ లేబొరేటరీ నుండి ఎలక్ట్రానిక్‌ ఆధారాలకు సంబంధించిన రెండు సెట్ల కాపీలు మాత్రమే అందాయని, వాటిలో ఒక కాపీని కోర్టుకు అందజేశానని, మరొకటి ప్రాసిక్యూషన్‌ వద్ద ఉన్నదని ఎన్‌ఐఎ చెబుతోంది.

➡️