బహిరంగ చర్చతో పరిష్కరించుకోవాలి

supreme court on tamil nadu govt and governor

తమిళనాడు గవర్నర్‌ అంశంలో సుప్రీంకోర్టు మరోసారి సూచన

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : బిల్లుల ఆమోదానికి సంబంధించిన వివాదాలను బహిరంగ చర్చతో పరిష్కరించుకోవాలని తమిళనాడు ముఖ్యమంత్రి, గవర్నర్‌లను సుప్రీంకోర్టు మరోసారి ఆదేశించింది. శాసనసభ ఆమోదించిన బిల్లులను సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉంచిన గవర్నర్‌ చర్యపై రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ విచారణలో ధర్మాసనం మరోసారి ఈ సూచనను ముందుకు తెచ్చింది. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను మళ్లీ రాష్ట్రపతి పరిశీలనకు పంపే అధికారం గవర్నర్‌కు ఉందా? లేదా? అనే అంశంపై వివరణాత్మక వాదన వినిపించాలని తమిళనాడు ప్రభుత్వం తరపున సీనియర్‌ న్యాయవాది మను అభిషేక్‌సింఘ్వీ కోరారు. దీనికి స్పందించిన సిజెఐ డివై చంద్రచూడ్‌ ‘జనవరిలోనే విచారిస్తాం. గవర్నర్‌ను కలిసేందుకు కూడా సిఎం సుముఖంగా ఉన్నారు. అది జరగనివ్వండి” అని అన్నారు. వివాదాలను చర్చలతో పరిష్కరించుకోవాలన్న సూచనను మరోసారి ధర్మాసనం ముందుంచింది. అయితే చర్చలతో వివాదాలు పరిష్కారమయ్యే సూచనలు కనిపించడం లేదని మను అభిషేక్‌సింఘ్వీ అన్నారు. దీనిపై స్పందిస్తూ ”ఏం చేయాలో అది చేస్తాం. కానీ, ముఖ్యమంత్రి, గవర్నర్‌లు సమావేశం కావడంలో ఇబ్బంది ఏమిటి? ముఖ్యమంత్రి, గవర్నర్‌ మధ్య చర్చకు మార్గం ఎప్పుడూ తెరిచి ఉంచాలి. ఒకరితో ఒకరు మాట్లాడుకోనివ్వండి” అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డివై చంద్రచూడ్‌ తెలిపారు.

➡️