కర్ణాటకలో 5, 8, 9, 11 తరగతుల పరీక్షలపై సుప్రీం స్టే

న్యూఢిల్లీ : కర్ణాటక రాష్ట్ర బోర్డుకు సంబంధించిన 5, 8, 9, 11 తరగతులకు పరీక్షలను నిర్వహించడానికి అనుమతిస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు సోమవారం స్టే విధించింది. పరీక్షలను నిర్వహించకూడదని, పరీక్షల ఫలితాలను విద్యార్థులకు లేదా తల్లిదండ్రులకు వెల్లడించకూడదని జస్టిస్‌ బేలా త్రివేది నేతృత్వంలోని ధర్మాసనం కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించింది. పరీక్షలు నిర్వహించడానికి అనుమతిస్తూ మార్చి 22న హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు అనుగుణంగా ఈ నెల 4న కర్ణాటక స్టేట్‌ క్వాలిటీ అస్సెస్‌మెంట్‌ అండ్‌ అక్రిడేషన్‌ కౌన్సిల్‌ జారీ చేసిన మార్గదర్శకాలకు వ్యతిరేకంగా రిజస్టర్డ్‌ అన్‌ఎయిడెడ్‌్‌ ప్రైవేట్‌ స్కూల్స్‌ మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌, ఆర్గనైజేషన్‌ ఫర్‌ అన్‌ ఎయిడెడ్‌ రికగ్నైజ్డ్‌ స్కూల్స్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ముఖ్యంగా 5, 8 తరగతులకు బోర్డు పరీక్షలు నిర్వహించడంపై పిటీషనర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ పిటీషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు హైకోర్టు ఆదేశాలపై స్టేవిధించింది. కర్ణాటక ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 23కు వాయిదా వేసింది. ఈ సందర్భంగా కర్ణాటకలో 5,8,9,11 తరగతులకు ప్రతిపాదించిన బోర్టు పరీక్షలు విద్యా హక్కు చట్టంలోని సెక్షన్‌ 2(ఎఫ్‌), 16, 30లకు విరుద్ధంగా ఉన్నాయని సుప్రీంకోర్టు ధర్మాసనం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ సెక్షన్లు ప్రకారం ప్రాథమిక విద్య పూర్తయ్యే వరకూ విద్యార్థులకు కఠినమైన బోర్టు పరీక్షలను నిర్వహించకూడదు. ‘ ప్రభుత్వం ప్రతిపాదించిన బోర్డు పరీక్షలు విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు, పాఠశాల యాజమాన్యాలకు తీవ్రమైన శారీరక, మానసిక వేదన, కష్టాలు కలిగించేవిధంగా ఉన్నాయి’ అని జస్టిస్‌ పంకజ్‌ మిట్టల్‌తో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది.

➡️