తమిళనాట హోరెత్తిన ప్రచారం

Apr 9,2024 07:36 #2024 elections, #Tamil Nadu
  • బలంగా ముందుకు సాగుతున్న ఇండియా ఫోరం
  •  ఎన్‌డిఎ నుంచి బయటకొచ్చి అన్నాడిఎంకె పోటీ
  •  చిన్నా చితకా పార్టీలతో బిజెపి కూటమి

ప్రజాశక్తి న్యూఢిల్లీ బ్యూరో : సార్వత్రిక ఎన్నికల మొదటి దశ పోలింగ్‌ దగ్గర పడుతున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు ప్రచారంలో మునిగి తేలుతున్నాయి. నేతల పరస్పర విమర్శలు, సవాళ్లతో రాజకీయ వేడి, వేసవి వేడిని మించిపోయింది. భిన్నమైన రాజకీయాలకు నిలయమైన తమిళనాడులోని 39 లోక్‌సభ స్థానాలకు మొదటి దశలోనే (ఏప్రిల్‌ 19న) ఎన్నికలు జరగనున్నాయి. ప్రధానంగా అధికార డిఎంకె నేతత్వంలోని ఇండియా ఫోరం, ప్రతిపక్ష అన్నాడిఎంకె కూటమి, బిజెపి నేతత్వంలోని ఎన్‌డిఎ కూటమి పోటీ చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ సమాఖ్య వాదాన్ని, ప్రజాస్వామ్యాన్ని, లౌకికవాదాన్ని బలపరుస్తూ ఇండియా ఫోరం ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ప్రతిపక్ష అన్నాడిఎంకె కూటమి కేంద్రం జోలికి పోకుండా కేవలం డిఎంకె ప్రభుత్వ పాలనపైనే విమర్శలు గుప్పిస్తూ ప్రచారం చేస్తోంది. బిజెపి కూటమి రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ, హిందూత్వాన్ని ప్రచారం చేస్తూ ఎన్నికల బరిలోకి దిగింది.

బిజెపితో అన్నాడిఎంకె తెగదెంపులు
జయలలిత మరణం తరువాత, శశికళ జైలు పాలైన తరువాత అధికార అన్నాడిఎంకెలో సంక్షోభం చోటు చేసుకుంది. ఎప్పటి నుంచి తమిళనాడు రాజకీయాల్లో జోక్యం చేసుకోవాలని బిజెపి ఆత్రపడగా, ఈ పరిణామంతో అన్నాడిఎంకె నేతలు మోడీ, షాల వద్దకు ప్రదక్షిణాలు చేశారు. దీంతో తమిళనాడు బిజెపి చేతుల్లోకి వెళ్లింది. ఈ పరిణామాలను సునితంగా పరిశీలించిన తమిళ ప్రజలు అదును చూసి, అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడిఎంకె, బిజెపి కూటమికి గట్టిదెబ్బకొట్టారు. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపితో కలిసి పోటీ చేసిన అన్నాడిఎంకె తన వైఖరిని మార్చుకుని, ఎన్‌డిఎ కూటమి నుంచి బయటకు వచ్చింది. బిజెపితో కలిసి వెళ్తే తమకు పరాభవం తప్పదని భావించిన అన్నాడిఎంకె, బిజెపితో తెగదెంపులు చేసుకుంది. అన్నాడిఎంకె తన ఓటు బ్యాంకును కాపాడుకోవడానికి మరో మూడు చిన్న చితకా పార్టీలతో పొత్తులు పెట్టుకొని ఎన్నికల బరిలో దిగింది. బిజెపి కూడా మరో మూడు చిన్న పార్టీలతో పొత్తు పెట్టుకొని ఎన్నికలకు దిగింది.

పక్షాల బలాబలాలు
2019 లోక్‌సభ ఎన్నికల్లో తమిళనాడులోని 39 స్థానాలకు గానూ 38 స్థానాలను డిఎంకె కూటమి గెలుచుకుంది. ఒక్క స్థానమే అన్నాడిఎంకె గెలుచుకుంది. బిజెపికి ఒక్కటి కూడా రాలేదు. డిఎంకె కూటమిలో డిఎంకె 24, కాంగ్రెస్‌ 8, సిపిఎం 2, సిపిఐ 2, ఐయుఎంఎల్‌, విసికె పార్టీలు ఒక్కొక్క స్థానం చొప్పున గెలుపొందాయి. అయితే ఇటీవల ప్రముఖ సినీ నటుడు కమలహాసన్‌ పార్టీ మక్కల్‌ నీది మైయం (ఎంఎన్‌ఎం)ను ఇండియా ఫోరంలో చేరి మద్దతిస్తోంది. ఈ పరిణామంతో డిఎంకె నేతృత్వంలోని పక్షానికి ప్రయోజనం జరగనుంది.

ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ
ప్రస్తుత ఎన్నికలో అన్నాడిఎంకె కూటమి తరపున అన్నాడిఎంకె 32, డిఎండికె 5, పిటి 1, ఎస్‌డిపిఐ 1 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. ఇండియా ఫోరంలో డిఎంకె 21, కాంగ్రెస్‌ 9, సిపిఎం, 2, సిపిఐ 2, విసికె 2, ఐయుఎంఎల్‌ 1, ఎండిఎంకె 1, కెడిఎంకె 1 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. బిజెపి కూటమిలో బిజెపి 24, పిఎంకె 10, ఎఎంఎంకె 2, టిఎంసి (తమిళ్‌ మనిలా కాంగ్రెస్‌) 3 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. బిజెపి పోటీ చేసే 24 స్థానాల్లో బిజెపి అభ్యర్థులు 20 స్థానాల్లో పోటీ చేయగా, నలుగురు ప్రాంతీయ పార్టీలకు చెందిన అభ్యర్థులు బిజెపి గుర్తుపై పోటీ చేస్తున్నారు.

సామాజిక సమీకరణలు
ఆధునికత ప్రారంభంతో కులం, మతం బలహీనపడతాయని ద్రవిడ పార్టీల ప్రాథమిక అంచనా. ఇది సమానత్వంపై ఆధారపడిన సమాజాన్ని రూపొందించడంలో సహాయ పడుతుందని ఆయా పార్టీలు పేర్కొంటున్నాయి. అయినప్పటికీ, తమిళనాడులోని వెల్లలార్లు, చెట్టియార్లు, ముధలియార్లు, నాయుడులు, గౌండర్లు, నాడార్లు, యాదవులు, తేవర్లు, వన్నియార్‌ల వంటి సామాజిక వర్గాలు రాజకీయంగా ఉన్నాయి. దక్షిణాది రాష్ట్రమైన తమిళనాడులో ఆధిపత్య రాజకీయ ఉద్యమం బ్రాహ్మణ వ్యతిరేకత నుండి జస్టిస్‌ పార్టీ, ఆత్మగౌరవ ఉద్యమం, ఆపై ప్రస్తుత రాజకీయ పార్టీల వరకు పురోగమించింది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే, విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు, సమాజంలోని విభిన్న వర్గాల మధ్య సామాజిక, రాజకీయ అభివద్ధి సూచికలపరంగా తమిళనాడు ప్రగతిని సాధించింది. తమిళనాడులో 68 శాతం ఒబిసిలు, 20.01 శాతం ఎస్‌సిలు, 1.10 శాతం ఎస్‌టిలు, మిగిలిన 10.7 శాతం అగ్రవర్ణాలు ఉన్నారు. తమిళనాడులో హిందువులు దాదాపు 87.58 శాతం (ఇందులో ఎస్‌సి, ఎస్‌టిలు ఉన్నారు), ముస్లింలు దాదాపు 5.86 శాతం, క్రైస్తవులు మరో 6 శాతం ఉండగా, ఇతరులు 0. 56 శాతం ఉన్నారు. 6 శాతం క్రైస్తవుల్లో గణనీయమైన భాగంగా దళితులు ఉన్నారు.

డిఎంకెకి అనుకూలాంశాలు
నీట్‌ రద్దు, జాతీయ విద్యా విధానం-2020 స్థానంలో ప్రత్యామ్నాయ విద్యా విధానం, విద్యను రాష్ట్ర జాబితాలోకి పునరుద్ధరించడం, గవర్నర్‌ ద్వారా రాష్ట్ర ప్రభుత్వంలోకి కేంద్రం జోక్యం, రాష్ట్రానికి నిధులు, ప్రతిపాదిత ఎనిమిది లేన్‌ల చెన్నై-సేలం గ్రీన్‌ కారిడార్‌ వంటి వాటిపై అన్నాడిఎంకె మౌనంగా ఉందని విమర్శలు వస్తున్నాయి. దీనిపై డిఎంకె కూటమి రాజీలేని పోరాటం చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం హిందీని జొప్పించడాన్ని కూడా డిఎంకె కూటమి పెద్ద ఎత్తున పోరాటం చేసింది. ప్రజాస్వామ్య పరిరక్షణకు కషి చేస్తోంది. బిజెపి తరపున ఇప్పటికే ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, పలువురు కేంద్ర మంత్రులు ప్రచారం చేశారు. డిఎంకె తరపున ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్‌, తనయుడు ఉదయనిధి స్టాలిన్‌ తదితరులు ప్రచారం చేస్తున్నారు. సిపిఎం నేతలు ప్రకాష్‌ కరత్‌, సీతారాం ఏచూరితో పాటు రాష్ట్ర నేతలు, సినీ ప్రముఖులు ప్రచారం చేస్తున్నారు. అన్నాడిఎంకె తరపున మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామి, తదితరులు ప్రచారం చేస్తున్నారు. అయితే బిజెపి విభజన రాజకీయాలకు పాల్పడుతోంది. ఈ వీటికి తమిళనాడులో స్థానం లేదు.

మొత్తం ఓటర్లు 6,18,90,348
పురుషులు 3,03,96,330
మహిళలు 3,14,85,724
థర్డ్‌ జండర్‌ 8,294
మొత్తం స్థానాలు 39

➡️