గవర్నర్‌ రవిపై మరోసారి సుప్రీంకోర్టుకు

  • తమిళనాడు ప్రభుత్వం నిర్ణయం

న్యూఢిల్లీ : తమిళనాడు గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి వ్యవహార శైలిపై ఆ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఎమ్మెల్యే కె.పొన్ముడిని మంత్రివర్గంలోకి తీసుకోవాలనే ప్రభుత్వ ప్రతిపాదనను గవర్నర్‌ తిరస్కరించడంతో స్టాలిన్‌ ప్రభుత్వం ఈ పిటీషన్‌ వేసింది. తమిళనాడు ప్రభుత్వం తరపున సీనియర్‌ న్యాయవాదులు అభిషేక్‌ మను సంఘ్వి, డిఎంకె రాజ్యసభ సభ్యులు, న్యాయవాది పి విల్సన్‌ ఈ పిటీషన్‌ వేశారు. ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం ముందుకు ఈ పిటీషన్‌ తీసుకొని వచ్చారు. ఈ పిటిషన్‌ను అత్యవసర జాబితాలో విచారించాలని విజ్ఞప్తి చేశారు. ‘గవర్నర్‌ పదేపదే నేరాలు చేస్తున్నారు. రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారు’ అని పిటిషన్‌లో పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పులకే గవర్నర్‌ రవి సొంత భాష్యం చెబుతున్నారని విమర్శించారు.
ఈ వివాదం పూర్తి వివరాల ప్రకారం ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తమిళనాడు మాజీ ఉన్నత విద్యాశాఖ మంత్రి కె పొన్ముడిని గత ఏడాది డిసెంబరులో మద్రాస్‌ హైకోర్టు దోషిగా నిర్ధారించింది. దీంతో పొన్ముడి సభ్యత్వంపై అనర్హత వేటు పడటంతోపాటు, ఆయనను మంత్రివర్గం నుంచి తొలగించారు. ఇదే కేసులో ఈ నెల 11న పొన్ముడిని సుప్రీంకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. దీంతో ఆయనపై అనర్హత వేటు తొలగిపోయింది. ఈ నేపథ్యంలో పొన్ముడిని మళ్లీ మంత్రివర్గంలోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్‌ భావించారు. మంత్రిగా పొన్ముడి చేత ఈ నెల 13, 14 తేదీల్లో ప్రమాణస్వీకారం చేయించాలని గవర్నర్‌కు సిఫార్సు చేశారు. ఈ నెల 14న ఢిల్లీకి వెళ్లిన గవర్నర్‌ ఈ నెల 16న చెన్నైకు తిరిగివచ్చారు. పొన్ముడిని మంత్రివర్గంలోకి తీసుకోవాలనే ప్రతిపాదనను తిరస్కరిస్తున్నట్లు ఈ నెల 17న ముఖ్యమంత్రికి సమాచారం ఇచ్చారు. దీంతో సోమవారం సుప్రీంకోర్టును తమిళనాడు ప్రభుత్వం ఆశ్రయించింది. ముఖ్యమంత్రి సిఫార్సును తిరస్కరిస్తూ భారత రాజ్యంగంలోని సెక్షన్‌ 164(1)ను గవర్నర్‌ రవి ఉల్లంగిస్తున్నారని ఆరోపించింది. సుప్రీంకోర్టు తీర్పునే వక్రీకరిస్తున్నారని తెలిపింది. ఇది సుప్రీంకోర్టు ఆదేశాలను అవమానించడమేనని ఆరోపించింది. కాగా, తమిళనాడు అసెంబ్లీ ఆమోదించిన కీలక బిల్లులను ఆమోదించకుండా ఏడాదికి పైగా కాలాన్ని వృథా చేసిన గవర్నర్‌ రవి తీరును నిరసిస్తూ తమిళనాడు ప్రభుత్వం గతంలో సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

➡️