శివసేన నేతపై కాల్పులు…

  • బిజెపి ఎమ్మెల్యే అరెస్ట్‌
  • పోలీస్‌ స్టేషన్‌లోనే ఘటన

ముంబయి : మహారాష్ట్రలో శివసేన (షిండే) నేత మహేష్‌ గైక్వాడ్‌పై బిజెపి ఎమ్మెల్యే గణపత్‌ గైక్వాడ్‌ శుక్రవారం రాత్రి కాల్పులు జరిపారు. పోలీస్‌ స్టేషన్‌లోనే ఈ ఘటన జరగడం విశేషం. కల్యాణ్‌ ఈస్ట్‌ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న గణపత్‌ శివసేనకు చెందిన కల్యాణ్‌ నగర అధ్యక్షుడు మహేష్‌పై ఈ దారుణానికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి గణపత్‌తో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఉల్హస్‌నగర్‌లోని హిల్‌లేన్‌ పోలీస్‌ స్టేషన్‌లో సీనియర్‌ ఇన్‌స్పెక్టర్‌ క్యాబిన్‌లో మహేష్‌, మరో వ్యక్తిపై గణపత్‌, ఆయన అనుచరుడు కాల్పులు జరిపారని డిఎస్‌పి సుధాకర్‌ పథారే తెలిపారు. గణపత్‌కు సహాయకులుగా వచ్చిన మరో ముగ్గురిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. అరెస్టుకు ముందు గణపత్‌ ఓ మరాఠీ ఛానల్‌తో మాట్లాడుతూ తన కుమారుడిని పోలీస్‌ స్టేషన్‌లో కొడుతుంటే మహేష్‌పై కాల్పులు జరిపానని, ఇందుకు తానేమీ విచారించడం లేదని చెప్పారు. ‘అవును. నేను కాల్పులు జరిపాను. ఇందుకు విచారించడం లేదు. పోలీస్‌ స్టేషన్‌లో పోలీసుల ముందే నా కుమారుడిని కొడుతుంటే నేనేం చేయాలి?’ అని ప్రశ్నించారు. ఐదు రౌండ్ల కాల్పులు జరిపానని కూడా ఆయన అన్నారు. ఈ ఘటన వెనుక ఆత్మరక్షణ లేదా కవ్వింపు అనేవే లేవని పోలీస్‌ అధికారులు తెలిపారు. మొత్తం పది బులెట్లు కాల్చారని, వాటిలో ఆరింటిని మహేష్‌ శరీరం నుండి తొలగించారని చెప్పారు. మహేశ్‌ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ కాల్పుల్లో శివసేన ఎమ్మెల్యే రాహుల్‌ పాటిల్‌ కూడా గాయపడ్డారు. శివసేన మద్దతుదారులు ఆసుపత్రి వద్దకు భారీ సంఖ్యలో చేరుకున్నారు. ఈ ఘటనపై శివసేన (థాకరే) తీవ్రంగా స్పందించింది. రాష్ట్రంలో ఆటవిక పాలన నడుస్తోందని విమర్శించింది.

షిండే రాజీనామా చేయాలి : ప్రతిపక్షాలు

అధికార దుర్వినియోగానికి కాల్పుల ఘటన నిదర్శనమని, కాల్పుల ఘటనకు బాధ్యత వహిస్తూ షిండే సిఎం పదవికి రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేశాయి. ఘటనకు సిఎం బాధ్యత వహించాలని ఎన్‌సిపి అధినేత శరద్‌పవార్‌ పేర్కొన్నారు. శాంతిభద్రతలు దిగజారాయని కాంగ్రెస్‌ విమర్శించింది. ‘పోలీస్‌ స్టేషన్‌లోనే కాల్పులు జరిగాయి. మా పార్టీ నేతపై బిజెపి ఎమ్మెల్యే కాల్పులు జరిపారు. మహారాష్ట్ర ఓ ఆటవిక రాజ్యంగా ఎలా మారిందో ఊహించండి. ప్రజలకు మేలు చేయాల్సిన ఎమ్మెల్యే కాల్పులకు తెగబడడం దురదృష్టకరం. మన రాష్ట్రం ఏ దిశగా సాగుతోంది?’ అని శివసేన (థాకరే) ప్రతినిధి ఆనంద్‌ దూబే ప్రశ్నించారు.

➡️