ఆ ఎన్‌కౌంటర్‌ బూటకం!

చనిపోయిన 12మందీ గ్రామస్తులే
చత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌పై స్థానిక ప్రజల కథనం
హైకోర్టుకు వెళతామంటున్న హక్కుల కార్యకర్తలు
న్యూఢిల్లీ : చత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించిన 12 మంది మావోయిస్టులు కాదని, స్థానికులని గ్రామస్తులు ఆదివారం తెలిపారు. ఎన్‌కౌంటర్‌లో 12మంది మావోయిస్టులు మరణించినట్లు భద్రతాబలగాలు ప్రకటించిన రెండు రోజుల తర్వాత ఈ విషయాలు వెల్లడయ్యాయి.
బూటకపు ఎన్‌కౌంటర్‌లో భద్రతా బలగాలు తమ కుటుంబ సభ్యులను చంపేశాయని ఆ మృతదేహాలను వెనక్కివ్వాలని డిమాండ్‌ చేస్తూ గ్రామస్తులు బీజాపూర్‌ జిల్లా కలెక్టరేట్‌ వెలుపల ధర్నా చేశారని మీడియా వార్తలు వెలువడ్డాయి. పోలీసులు మాత్రం ఈ వాదనలను కొట్టిపారేస్తున్నారు. కేవలం మావోయిస్టులు మాత్రమే ఎన్‌కౌంటర్‌లో చనిపోయారని అధికారులు స్పష్టం చేస్తున్నారు. అటవీ ప్రాంతంలో పోలీసులు వారిని చూడడంతోనే వారు స్థానికుల్లాగా బట్టలు వేసుకున్నారని చెబుతున్నారు.
గ్రామస్తుల వాదనలు
ఈ ప్రాంత వాసులనే భద్రతా బలగాలు చంపాయని, ఈ ఎన్‌కౌంటర్‌ బూటకమని గ్రామస్తులు పేర్కొంటున్నారు. ఎన్‌కౌంటర్‌ను చూసిన పెడియా గ్రామవాసి గురునంద మాట్లాడుతూ, తునికాకు (బీడి ఆకులు) కోసుకోవడం కోసం కొంతమంది గ్రామస్తులు అడవికి వెళ్లారని చెప్పారు. అదే సమయంలో భద్రతా సిబ్బంది వారివైపు వచ్చారని, ఇదిచూసి భయంతో గ్రామస్తులు పారిపోవడం మొదలెట్టారని చెప్పారు. దాంతో వెంటనే భద్రతా సిబ్బంది వారిపై కాల్పులు జరిపారని గురునంద మీడియాకు చెప్పారు.
కోర్చులి గ్రామానికి చెందిన రాజు మాట్లాడుతూ, తమ బంధువుల మృతదేహాలను తీసుకెళ్లడానికి వచ్చామని చెప్పారు. ఈ దాడిలో మరణించిన లాలూ కుంజమ్‌ మావోయిస్టు కాదని, రైతు అని చెప్పారు. అతడు ఇంటివద్దే వున్నాడని, పోలీసులను చూసి పారిపోతుంటే కాల్చి చంపేశారని తెలిపారు.
పెడియా గ్రామానికి చెందిన మరో వ్యక్తి రాకేష్‌ అల్వమ్‌ మాట్లాడుతూ, తన తమ్ముడు మోటో అల్వమ్‌ను కూడా కాల్చేశారని, అతను కూడా బీడి ఆకులు కోసుకోవడానికే అడవికి వెళ్లాడని చెప్పారు. పెడియా, ఇటావర్‌ గ్రామాలను పోలీసులు చుట్టుముట్టారని తెలిపారు. తన తమ్ముడు అడవిలో పోలీసుల బుల్లెట్‌ తగిలి చనిపోయాడని, ఈ ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన వారందరూ గ్రామస్తులే, మావోయిస్టులు కాదని చెప్పారు. రెండు గ్రామాల నుండి వారిని తీసుకువచ్చి మరీ చంపేశారని తెలిపారు. బీజాపూర్‌ పోలీసులు జారీ చేసి పత్రికా ప్రకటనలో పేర్కొన్న వారందరినీ తాను గుర్తించానని రాకేష్‌ అల్వమ్‌ చెప్పారు. మృతి చెందిన వారందరూ ఇటావర్‌, పెడియా గ్రామస్తులేనన్నారు.
పోలీసు స్టేట్‌మెంట్‌
నిషేధిత కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ ఇండియా(మావోయిస్టు) ఆర్మీ కంపెనీ నెంబర్‌ టూ సభ్యులైన బుద్ధు ఒయామ్‌, కల్లూ పూనమ్‌లతో సహా 12మంది మావోయిస్టులు చనిపోయినట్లు శుక్రవారం భద్రతా బలగాలు ప్రకటించాయి. వీరిద్దరిని పట్టుకుంటే చెరో రూ.8లక్షలు చొప్పున బహుమతి ఇస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించినట్లు పేర్కొన్నాయి. ఎన్‌కౌంటర్‌లో మరణించిన ఇతరుల్లో లాఖే కుంజమ్‌ గంగలూర్‌ ఏరియా కమిటీ సభ్యుడని, భీమా కరమ్‌ ఆర్మీ ప్లాటూన్‌ నెం.12 సభ్యుడని అధికారులు తెలిపారు. వీరిపై కూడా చెరో రూ.5లక్షలు రివార్డు ప్రకటించినట్లు తెలిపాయి. బీజాపూర్‌ జిల్లా ఎస్‌పి జితేంద్ర యాదవ్‌ మాట్లాడుతూ ప్లాటూన్‌ కమాండర్‌ సన్నూ లకోమ్‌, జంతన సర్కార్‌ ఉపాధ్యక్షుడు అల్వమ్‌లపై కూడా రెండేసి లక్షల చొప్పున రివార్డు ఇప్పటికే ప్రకటించినట్లు చెప్పారు.
కోర్టుకు వెళ్లనున్న హక్కుల కార్యకర్తలు
ఈ సంఘటనపై తాము చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మానవ హక్కుల కార్యకర్తలు తెలిపారు. బస్తర్‌ ప్రాంతంలో పనిచేస్తున్న గిరిజన హక్కుల కార్యకర్త సోని సోరి మాట్లాడుతూ, బీడి ఆకులు కోసుకోవడానికి అడవిలోకి వెళ్లిన వారిపై కాల్పులు జరిపి చంపడమే కాకుండా కొంతమంది గ్రామస్తులను ఇళ్ల నుండి తీసుకెళ్లి మరీ అడవిలో చంపేశారని తెలిపారు. ”పోలీసులు అమాయకులైన గ్రామస్తులను చంపేశారు, అందువల్లే హైకోర్టులో పిటిషన్‌ వేయాలనుకుంటున్నాం.” అని ఆమె చెప్పారు. చనిపోయింది మావోయిస్టులేనని పోలీసులు కూడా ధృఢంగా చెబుతున్నారు.
దక్షిణ బస్తర్‌ ప్రాంత డిఐజి కామ్‌లోచన్‌ కాశ్యప్‌ మాట్లాడుతూ, ”మావోయిస్టులు దుస్తులు మార్చుకుని గ్రామస్తులతో కలిసిపోయారు. మరణించిన వారందరూ మావోయిస్టులే, గ్రామస్తులు కాదు. తమ బంధువులైన మావోయిస్టుల మృతదేహాలను తీసుకెళ్లడానికి గ్రామస్తులు వచ్చారు. ప్రశ్నించడం కోసం మొత్తంగా 70మందిని గంగలూరు పోలీసు స్టేషన్‌కు తీసుకొచ్చాం. వారిలో దాదాపు తొమ్మిది మంది కరడుగట్టిన మావోయిస్టులు. ఈ తొమ్మిది మంది కూడా మరణించిన మావోయిస్టులను తమ కార్యకర్తలుగా గుర్తించారు.” అని చెప్పారు.

➡️