కాంగ్రెస్‌, ఆప్‌ మధ్య కుదిరిన పొత్తు

Feb 25,2024 10:53 #AAP, #alliance, #Congress

ఐదు రాష్ట్రాల్లో సీట్ల సర్దుబాటు

ప్రజాశక్తి – న్యూఢిల్లీ బ్యూరో :   లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) మధ్య పొత్తు కుదిరింది. ఢిల్లీ సహా గుజరాత్‌, హర్యానా, చండీగఢ్‌, గోవాలో సీట్ల సర్దుబాటు ఓ కొలిక్కి వచ్చింది. సీట్ల సర్దుబాటుపై పలు దఫాల చర్చల అనంతరం ఇరు పార్టీలూ ఒప్పందానికి వచ్చాయి. ఈ మేరకు ఐదు రాష్ట్రాల్లో కలిసి పోటీ చేస్తున్నట్టు శనివారం అధికారికంగా ప్రకటించాయి. శనివారం నాడిక్కడ కాన్‌స్టిట్యూషన్‌ క్లబ్‌లో కాంగ్రెస్‌, ఆప్‌ నేతలు సంయుక్తంగా మీడియా సమావేశంలో వెల్లడించారు. మొత్తం ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌-ఆప్‌ కలిసి పోటీ చేస్తున్నట్టు ప్రకటించాయి. దేశ రాజధాని ఢిల్లీలో మొత్తం ఏడు లోక్‌సభ స్థానాలకు గానూ అధికార ఆప్‌ నాలుగు స్థానాల్లో పోటీ చేయనుంది. మూడు స్థానాల్లో కాంగ్రెస్‌ పోటీ చేస్తుంది. పశ్చిమ ఢిల్లీ, దక్షిణ ఢిల్లీ, తూర్పు ఢిల్లీ, న్యూఢిల్లీలో పోటీ చేయనుంది. ఇక కాంగ్రెస్‌ నార్త్‌ ఈస్ట్‌ ఢిల్లీ, నార్త్‌ వెస్ట్‌ ఢిల్లీ, చాందినీ చౌక్‌ స్థానాల్లో బరిలో ఉంటుందని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ముకుల్‌ వాస్నిక్‌ వెల్లడించారు.

గుజరాత్‌లో 26 లోక్‌సభ స్థానాలకు గానూ కాంగ్రెస్‌ 24 స్థానాల్లో పోటీ చేయనుంది. ఆప్‌కు రెండు స్థానాలు కేటాయించారు. భరూచ్‌, భావ్‌నగర్‌లో ఆప్‌ అభ్యర్థులు పోటీ చేయనున్నారు. అదేవిధంగా హర్యానాలో మొత్తం 10 లోక్‌సభ స్థానాలకు గానూ కాంగ్రెస్‌కు 9 స్థానాల్లో పోటీకి దిగనుంది. ఆప్‌ ఒక్కస్థానం కురుక్షేత్రలో బరిలో నిలవనుంది. గోవా, చండీగఢ్‌ లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్‌ మాత్రమే పోటీలో నిలిచేలా ఒప్పందం కుదిరినట్టు ముకుల్‌ వాస్నిక్‌ తెలిపారు. ఇక గోవా, చండీగఢ్‌ లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్‌ ఒంటరిగానే బరిలో దిగనుంది. గోవాలో ఉన్న రెండు లోక్‌సభ నియోజకవర్గాలు, చండీగఢ్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పోటీ చేయనుంది.

పంజాబ్‌లో విడివిడిగానే..

మరోవైపు పంజాబ్‌లో ఇరు పార్టీల మధ్య ఎలాంటి పొత్తు ఉండబోదని ఆప్‌ చీఫ్‌, ఢిల్లీ సిఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ఇప్పటికే స్పష్టం చేశారు. పంజాబ్‌లో మొత్తం 13 స్థానాల్లో ఆప్‌, కాంగ్రెస్‌ విడివిడిగానే బరిలోకి దిగుతాయని చెప్పారు.

➡️