ద్వంద్వ పౌరసత్వానికి ద్వారాలు తెరుస్తున్న సిఎఎ నిబంధనలు : సుప్రీంలో సిఎఎ వ్యతిరేక పిటిషన్‌దారుల ఆందోళన

న్యూఢిల్లీ : భారతదేశ పౌరసత్వం కావాలని కోరుతున్న విదేశీయులు తమ స్వదేశ పౌరసత్వాన్ని విడనాడాల్సిన అవసరం లేదని పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) నిబంధనలు పేర్కొంటున్నందున ఈ నిబంధనలు ద్వంద్వ పౌరసత్వానికి ద్వారాలు తెరుస్తున్నాయని సిఎఎ వ్యతిరేక పిటిషన్‌దారులు సుప్రీంకోర్టులో ఆందోళన వ్యక్తం చేశారు. సిఎఎ నిబంధనలపై స్టే విధించాలని కోరుతూ వేసిన తమ పిటిషన్‌పై ఏప్రిల్‌ 9న విచారణ జరగనున్న నేపథ్యంలో పిటిషన్‌దారులు రాతపూర్వకంగా తమ వాదనలు దాఖలు చేశారు. పౌరతస్వ చట్టం-1955లోని సెక్షన్‌ 9, రాజ్యాంగంలోని 9వ అధికరణ రెండూ కూడా ద్వంద్వ పౌరసత్వాన్ని స్పష్టంగా నిషేధిస్తున్నాయి. మరో దేశ జాతీయులకు భారత పౌరసత్వాన్ని మంజూరు చేసేటపుడు వారు ముందుగా ఆ దేశ పౌరసత్వాన్ని త్యజించాల్సిన వాస్తవాన్ని సిఎఎ నిబంధనలు విస్మరించాయని ఇండియన్‌ యూనియన్‌ ముస్లిం లీగ్‌ నేతృత్వంలోని పిటిషనర్లు పేర్కొన్నారు. సిఎఎలో అంతర్లీనంగా మతపరమైన వేధింపులు కనిపిస్తున్నాయని వారు పేర్కొన్నారు. పొరుగుదేశాలపైన పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, ఆఫ్ఘనిస్తాన్‌ల్లో మైనారిటీలు వేధింపులు ఎదుర్కొంటూ ఇక్కడకు వచ్చిన శరణార్ధుల కోసం ఈ చట్టాన్ని తీసుకువచ్చినట్లు కేంద్రం పేర్కొంటోంది. కానీ ఇలా వచ్చిన శరణార్ధుల్లో కూడా ఎంపిక చేసిన గ్రూపుల వారిని మాత్రమే సిఎఎ ప్రయోజనాలకు అర్హులుగా ప్రకటించారని వారుపేర్కొన్నారు. మినహాయించబడిన శరణార్ధుల గ్రూపులు అక్రమ శరణార్ధులుగానే కొనసాగాల్సి వుంటుందన్నారు. వారికి భారత పౌరసత్వం కోరే అవకాశం కూడా లేకుడా పోయిందన్నారు.

➡️