రెండో దశ పోలింగ్‌కు ముగిసిన ప్రచారం!

89 స్థానాల్లో రేపే పోలింగ్‌
న్యూఢిల్లీ : 13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వ్యాప్తంగా 89 స్థానాల్లో శుక్రవారం రెండో దశ పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. అత్యంత ఉధృతంగా హోరాహోరీగా సాగిన ఎన్నికల ప్రచారానికి బుధవారం సాయంత్రం 5గంటలతో తెరపడింది. కేరళలోని 20 స్థానాలకు, కర్ణాటకలోని 28 స్థానాలకు గానూ 14 సీట్లలో, రాజస్థాన్‌లో 13, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లో ఎనిమిదేసి సీట్లలో, మధ్యప్రదేశ్‌లో ఏడు, అస్సాం, బీహార్‌ల్లో ఐదేసి నియోజకవర్గాల్లో, చత్తీస్‌ఘడ్‌, పశ్చిమ బెంగాల్‌లో మూడేసి సీట్లలో, మణిపూర్‌, త్రిపుర, జమ్మూ కాశ్మీర్‌ల్లో ఒక్కో స్థానానికి శుక్రవారం ఎన్నికలు జరుగుతున్నాయి. శుక్రవారం ఉదయం 7గంటలకు ప్రారంభమైన ఓటింగ్‌ సాయంత్రం 5గంటలకు ముగుస్తుంది. ఈ రెండో దశ పోలింగ్‌లో పాలక బిజెపికి, ప్రతిపక్ష ఇండియా బ్లాక్‌కు మధ్య గట్టి పోటీ వుండనుంది. రెండో దశలో కొంతమంది ప్రముఖులు బరిలో వున్నారు. సిపిఎం నుంచి కోవిడ్‌ కట్టడిలో ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలందుకున్న కేరళ ఆరోగ్యశాఖ మాజీ మంత్రి కె.కె.శైలజ వడక్కర నుండి, పాలక్కాడ్‌ నియోజకవర్గం నుండి సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు ఎ.విజయరాఘవన్‌, పతనాంతిట్ట నుంచి కేరళ మాజీ ఆర్థిక మంత్రి డాక్టర్‌ థామస్‌ ఇజాక్‌ తదితరులు పోటీ పడుతున్నారు. వాయనాడ్‌ నుండి రాహుల్‌ గాంధీ, తిరువనంతపురం నుండి కాంగ్రెస్‌కు చెందిన శశి థరూర్‌, బిజెపికి చెందిన రాజీవ్‌చంద్రశేఖర్‌, మథుర నుండి హేమమాలిని, రాజ్‌నంద్‌గావ్‌ నుండి భూపేష్‌ భాగెల్‌, బెంగళూరు రూరల్‌నుండి డి.కె.సురేష్‌, బెంగళూరు సౌత్‌ నుండి తేజస్వి సూర్య ప్రభృతులు పోటీ పడుతున్నారు.
17 రాష్ట్రాలు, నాలుగు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 102 నియోజకవర్గాల్లో మొదటి దశ పోలింగ్‌ ఈ నెల 19న జరిగింది.

➡️