బాలిక గర్భవిచ్చిత్తికి సుప్రీం అనుమతి

  • మానసిక, శారీరక శ్రేయస్సుకు అసాధారణ నిర్ణయం

న్యూఢిల్లీ : అత్యాచారానికి గురైన 14 ఏళ్ల బాలిక 30 వారాల గర్భవిచ్ఛిత్తికి సోమవారం సుప్రీంకోర్టు అనుమతించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 142 కింద తనకు లభించిన అసాధారణ అధికారాలను ఉపయోగించి బాధిత బాలికకు పూర్తి న్యాయం చేయడానికి సుప్రీంకోర్టు ఈ గర్భ విచ్ఛిత్తికి అనుమతించింది. బాలిక మానసిక, శారీరక శ్రేయస్సును రక్షించడానికి అసాధారణ నిర్ణయం తీసుకుంది. మెడికల్‌ టెర్మినేషన్‌ ఆఫ్‌ ప్రెగెన్సీ (ఎంటిపి) కింద సాధారణంగా 24 వారాల ఉన్న గర్భవిచ్ఛిత్తికే అనుమతి ఉంటుంది. ప్రెగెన్సీని పొడిగించడం మైనర్‌ శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందన్న మెడికల్‌ బోర్డ్‌ సిఫారసులకు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్‌, జస్టిస్‌ జె.బి. పార్థివాలాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం అంగీకరించింది. గర్భం దాల్చిన విషయాన్ని అత్యాచార బాధిత బాలిక ఆలస్యంగా గుర్తించింది. చట్టం ప్రకారం అనుమతి ఉన్న 24 వారాల తరువాత అంటే మార్చి 20న ఈ కేసులో ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. గర్భవిచ్ఛిత్తికి బాంబే హైకోర్టు ఈ నెల 4న తిరస్కరించడంతో బాలిక తల్లి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. బాలికకు ప్రతీ గంట కీలకమని సిజెఐ చంద్రచూడ్‌ వ్యాఖ్యానించారు. ఈ కేసులో తరువాత పూర్తి వివరాలతో ఆదేశాలు జారీ చేస్తామని తెలిపారు. కోర్టు విధివిధానాలను సాకుగా చూపుతూ వైద్య ప్రక్రియను ఆలస్యం చేయవద్దని అధికారులను ఆదేశించింది. బాలిక వైద్య, రవాణా ఖర్చులను భరించడానికి మహారాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది.

➡️