అర్చకుల వేషంలోనే పోలీసు విధులు

Apr 13,2024 08:06 #dress code, #police, #Varanasi

కాశీ విశ్వనాథ ఆలయంలో ట్రయల్‌ రన్‌
యోగి సర్కార్‌ వింత నిర్ణయంపై సర్వత్రా విమర్శలు
వారణాసి : ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి కాశీవిశ్వనాథ ఆలయంలో విధులు నిర్వహించే పోలీసులు అర్చకుల మాదిరిగానే ధోతి, కుర్తా ధరించి, నుదుట తిలకం దిద్దుకుని విధులు నిర్వహిస్తున్నారు. యోగి ఆదిత్యనాధ్‌ ప్రభుత్వ ఉత్తర్వులు మేరకు వారణాసిలో పోలీసులు ఈ విధమైన వేషధారణతో విధుల్లో పాల్గంటున్నారు. ఈ విషయంపై వారణాసి పోలీస్‌ కమిషనర్‌ మోహిత్‌ అగర్వాల్‌ మాట్లాడుతూ ఆలయం వద్ద విధులు నిర్వహించే పోలీసులకు ఇటీవల కమ్యూనికేషన్‌ నైపుణ్యాలపై మూడు రోజుల సమగ్ర శిక్షణా కార్యక్రమం నిర్వహించినట్లు చెప్పారు. ట్రయల్‌రన్‌లో భాగంగా 15 రోజుల పాటు పోలీసులు ధోతి, కుర్తా ధరించి ఆలయం వద్ద విధుల్లో పాల్గంటారని తెలిపారు. ఆ తరువాత సమీక్ష నిర్వహించి, దీనిపై తుది నిర్ణయం తీసుకుంటామని అగర్వాల్‌ తెలిపారు. నో టచ్‌ విధానాన్ని కూడా అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఈ విధానంలో భక్తులను పోలీసులు నేరుగా తాకకుండా తాళ్లతో భక్తులను నియంత్రిస్తుంటారు.
ఏ పోలీస్‌ మాన్యువల్‌ ప్రకారం ఇలా చేస్తున్నారు : అఖిలేష్‌యాదవ్‌
పోలీసులు అర్చకుల వేషధారణ చేసుకోవడం, నుదుటిపై తిలకం ధరించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ఎస్‌పి నాయకులు, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌ స్పందిస్తూ ‘పోలీసులు అర్చకుల దుస్తులు ధరించడం ఏ పోలీస్‌ మాన్యువల్‌ ప్రకారం సరైనది?’ అని ప్రశ్నించారు. ఇలాంటి ఆదేశాలు ఇచ్చేవారిని తక్షణమే సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ఇలాంటి చర్యలు ‘ఖండించాల్సినవి’ అని పేర్కొన్నారు. ఎవరైనా మోసగాళ్లు దీనిని వినియోగించుకుని అమాయక ప్రజల్ని లూటీ చేస్తే యుపి ప్రభుత్వం, అధికారులు ఏం సమాధానం చెబుతారని అఖిలేష్‌ ప్రశ్నించారు.
కాశీ విశ్వనాథ ఆలయంలో పోలీసులు అర్చకుల వేషధారణలో విధుల నిర్వహించడం ఇదే మొదటిసారి కాదు. 2018లోనూ దీనిని ప్రయోగాత్మకంగా పరిశీలించినా, కొన్ని కారణాలతో నిలిపివేశారు. ఈ ఆలయాన్ని రోజుకు సుమారు ఐదు లక్షల మంది దర్శించుకుంటారు. దాదాపు 800 మంది పోలీసులు వివిధ షిప్టుల్లో విధులు నిర్వహిస్తుంటారు.

➡️