ప్రత్యేక రాష్ట్రంగా పశ్చిమ యుపి : మాయావతి

Apr 16,2024 08:19 #2024 elections, #​​Mayavati

లక్నో : పశ్చిమ యుపిని ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేస్తామని బహుజన్‌ సమాజ్‌ పార్టీ (బిఎస్‌పి) అధ్యక్షురాలు మాయావతి ప్రజలకు హామీ ఇచ్చారు. ముజఫర్‌ నగర్‌ పార్లమెంట్‌ స్థానానికి బిఎస్‌పి అభ్యర్థి దారా సింగ్‌ ప్రజాపతికి మద్దతుగా ఎన్నికల ప్రచార సభలో ఆమె మాట్లాడారు. ‘పశ్చిమ ఉత్తరద్రేశ్‌ను ప్రత్యేక రాష్ట్రంగా మార్చాలని మీరు కోరుకుంటున్నారు. మా ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వస్తే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు దిశగా చర్యలు తీసుకుంటాం’ అని అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని పశ్చిమ ప్రాంతంలోని ముస్లింలు, జాట్‌ కమ్యూనిటీ సభ్యుల మధ్య ఐక్యత, సోదరభావం అవసరమని మాయావతి అన్నారు. 2013లో అల్లర్ల వల్ల వారి మధ్య ఐక్యత లేకుండా పోయిందని అన్నారు. బిఎస్‌పి హయాంలో రాష్ట్రంలో శాంతి నెలకొందని చెప్పారు. ‘నిరుద్యోగం, పేదరికం, వెనుకబాటుతనం, వలసలకు దారితీసే విధానాలను బిజెపి రూపొందిస్తోంది. అట్టడుగున ఉన్నవారి కోసం పెట్టే ఖర్చుతో బడా పెట్టుబడిదారులు ఎదిగేందుకు బిజెపి సహాయం చేస్తోంది. గత కొన్నేళ్లుగా యుపిలోనూ, కేంద్రంలోను బిజెపి అధికారంలో ఉంది. బిజెపి అధికారంలో ఉండడం వల్ల ముస్లింల పురోగతి చాలా వరకు ఆగిపోయింది. మతం పేరుతో హింస పెరిగిపోయింది’ అని ఆమె అన్నారు. ఇండియా బ్లాక్‌ సామాజిక, కుల విభజనను సృష్టిస్తోందని ఆరోపించారు.
ముజఫర్‌ నగర్‌లో బిఎస్‌పి నుంచి ప్రజాపతి, బిజెపి నుంచి బల్యాన్‌, ఎస్‌పి నుంచి హరేంద్ర మాలిక్‌ పోటీ చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో మొదటి దశలో సహరాన్‌పూర్‌, కైరానా, ముజఫర్‌నగర్‌, బిజ్నోర్‌, నగీనా, మొరాదాబాద్‌, రాంపూర్‌, పిలిభిత్‌ నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.

➡️