ఉన్నత విద్యలో మహిళా ప్రాతినిధ్యం తక్కువే : అఖిల భారత సర్వేలో వెల్లడి

Mar 9,2024 10:01

న్యూఢిల్లీ : ఉన్నత విద్యా సంస్థల్లో మహిళల ప్రవేశాన్ని పెంచేందుకు, లింగ సమానత్వాన్ని సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇవ్వడం లేదు. ఉన్నత విద్యా సంస్థల్లో మహిళల ప్రాతినిధ్యం ఇప్పటికీ తక్కువగానే ఉంటోంది. ఉన్నత విద్యపై కేంద్ర విద్యా శాఖ నిర్వహించిన అఖిల భారత సర్వేలో ఈ విషయం బయటపడింది. లింగ సమానత్వాన్ని పెంపొందించడంలో ఉన్నత విద్యా సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. అయితే శాఖాధిపతులు, డీన్‌ లేదా వైస్‌ ఛాన్సలర్‌ వంటి నాయకత్వ పదవుల్లో మహిళలకు పురుషులతో సమాన ప్రాతినిధ్యం కల్పిస్తే ఈ పాత్రకు మరింత ప్రాధాన్యత ఏర్పడుతుంది. నాణ్యమైన ఉన్నత విద్యను, పరిశోధనను పెంచే దిశగా మహిళలు లింగ పరంగా సమతూకమైన వైఖరిని ప్రదర్శిస్తారు. అయితే విద్యా వ్యాప్తి జరుగుతున్నప్పటికీ ఉన్నత విద్యా సంస్థల్లో నాయకత్వ స్థానాలను ఎంపిక చేసుకోవడంలో మహిళలు ముందుకు రావడం లేదు. వివిధ ఆర్థిక, సామాజిక అంశాలే దీనికి కారణమని సర్వే తెలిపింది. ‘ఉన్నత విద్యలో మహిళలు’ అనే అంశంపై 2021లో యునెస్కో ఓ నివేదికను విడుదల చేసింది. విద్యావేత్తలు, పరిశోధకుల్లో మహిళలు ఉన్నత స్థానాలు పొందడం లేదని ఈ నివేదిక తెలిపింది. దిగువ స్థాయిలో ఉపాధ్యాయ సిబ్బందిలో మహిళల ప్రాతినిధ్యం బాగా ఎక్కువగానే ఉన్నప్పటికీ ఉన్నత స్థాయిలో మాత్రం తక్కువగా ఉన్నదని ఆ నివేదిక వివరించింది.

2019-20లో ప్రాథమిక స్థాయిలో పాఠశాల ఉపాధ్యాయులుగా పనిచేసిన మహిళల సంఖ్య పురు షుల సంఖ్యను అధిగమించిందని విద్యా మంత్రిత్వ శాఖ ప్రచురించిన నివేదిక పేర్కొంది. అయితే అప్పర్‌ ప్రైమరీ, ఆపై స్థాయిలో ఉండే పోస్టుల్లో మాత్రం పురుష ఉపాధ్యాయుల సంఖ్యే అధికంగా ఉంది. ఉన్నత విద్యలో ప్రవేశాన్ని స్థూల నమోదు నిష్పత్తి (జీఈఆర్‌) ఆధారంగా లెక్కిస్తారు. 18-23 సంవత్స రాల వయసున్న వారిలో ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశం పొందిన వారి నిష్పత్తిగా జీఈఆర్‌ ను పరిగణనలోకి తీసుకుంటారు. ఓ నివేదిక ప్రకారం అఖిల భారత స్థాయిలో పురుష జనాభా స్థూల నమోదు నిష్పత్తి (జీఈఆర్‌) 2012-13లో 22.7% నుండి 28.3%కి పెరగ్గా అదే కాలంలో మహిళల జీఈఆర్‌ 20.1% నుండి 28.5%కి పెరిగింది. 2019-20లో తొలిసారిగా మహిళా విద్యార్థుల సంఖ్య పురుష విద్యార్థుల కంటే పెరిగింది.

2021-22లో ప్రొఫెసర్లు, అసోసియేట్‌ ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, డిమానిస్ట్రేటర్లు, తాత్కాలిక ఉపాధ్యాయులు, విజిటింగ్‌ టీచర్ల సంఖ్య 16 లక్షలు ఉండగా వారిలో 43% మంది మహిళలే. యూనివర్సిటీ స్థాయిలో 2.50 లక్షల మంది ఉపాధ్యాయులు ఉండగా వారిలో 38.4% మంది మాత్రమే మహిళలు. కళాశాల స్థాయిలో 11.8 లక్షల ఉపాధ్యాయులు ఉండగా వారిలో 44.4% మంది మహిళలు ఉన్నారు. బీహార్‌, జార్ఖండ్‌లో మహిళా ఉపాధ్యాయుల సంఖ్య బాగా తక్కువగా ఉంది. కేరళ, పంజాబ్‌, హర్యానా, చండీఘర్‌, మేఘాలయ, నాగాలాండ్‌, ఢిల్లీ, గోవాలో మాత్రం పురుష ఉపాధ్యాయుల కంటే మహిళా ఉపాధ్యాయులే ఎక్కువ. ఉన్నత విద్యలో మహిళా అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల ప్రాతినిధ్యం బాగా తక్కువగా ఉంది. ఆపై స్థాయి ఉద్యోగాలలో అయితే వారి ప్రాతినిధ్యం మరింత తగ్గింది. జాతీయ స్థాయిలో 2021-22లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్లలో 44.41% మంది మహిళలు ఉండగా అసోసియేట్‌ ప్రొఫెసర్లుగా 37.85%, ప్రొఫెసర్లుగా 29.52% మంది మహిళలు మాత్రమే పనిచేస్తున్నారు. 2011-12 నుండి 2021-22 వరకూ దేశంలో అన్ని స్థాయిలో మహిళా విద్యావేత్తల సంఖ్య కేవలం 4% మాత్రమే పెరిగింది.

➡️